ఏపీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తిపై స్పందించిన సీబీఐ కోర్టు
ఏపీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తిపై స్పందించిన సీబీఐ కోర్టు
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారిక వ్యవహారాల్లో తలమునకలై ఉన్నందున తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తానే ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం ఉందని కోర్టు ఆదేశించినప్పుడు తప్పకుండా వస్తాను కానీ అప్పటి వరకు ప్రతీ వాయిదాకు తాను రాకుండా తన తరఫున న్యాయవాది జి.అశోక్ రెడ్డి హాజరయ్యేందుకు అనుమతించాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈమేరకు సీఆర్‌పీసీ సెక్షన్ 205 కింద హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో వైఎస్ జగన్ గురువారం పిటిషన్ దాఖలు చేశారు.
"ఇప్పటికే ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. దీనికితోడు తరచుగా హైదరాబాద్‌లో కోర్టు విచారణకు హాజరుకావడం వల్ల రాష్ట్రంలో పరిపాలన కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని వైఎస్ జగన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున కోర్టుకు వచ్చే ప్రతీసారీ ప్రొటోకాల్‌తోపాటు భద్రతకు భారీగా వ్యయం అవుతుంది" అని పిటిషన్‌లో వివరించారు. వైఎస్ జగన్ పిటిషన్‌పై స్పందించిన సీబీఐ కోర్టు.. ఈ నెల 20వ తేదీకి పిటిషన్ విచారణను వాయిదా వేసినట్టు తెలుస్తోంది.