Amaravati: రాజధాని అంశంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ఓవైపు శాసనమండలి రద్దు దిశగా పావులు కదుపుతోన్న వైఎస్సార్ సీపీ సర్కార్.. రాజధాని అంశాన్ని సీరియస్గా తీసుకుంది. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని, పాలన ఎక్కడినుంచైనా చేయవచ్చునని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అభివృద్ధి కావాలనుకుంటే మూడు రాజధానులను స్వాగతించాలని చెబుతూనే ఏపీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంలో రాజ్యాంగం అనే పదమే లేదన్నారు. మరోవైపు రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను శాసన మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపడంపై అసహనం వ్యక్తం చేశారు. తమకు మెజార్టీ లేని మండలిని రద్దు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదన్నారు. కేవలం సిట్ ఆఫ్ గవర్నెన్స్ అని మాత్రమే పేర్కొన్నట్లు చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశాలపై రాష్ట్రంలో ఎక్కడినుంచైనా పరిపాలన కొనసాగించవచ్చునని, వాటికి బిల్లు, చట్టాలతో పని లేదని అభిప్రాయపడ్డారు. ప్రజల చేత ఎన్నికైన నేతలు చట్టసభల్లో తీర్మానం చేసే అంశాలే గవర్నెన్స్ అని, అసెంబ్లీ ఎక్కడైనా ఉండొచ్చునని చెప్పారు. ప్రభుత్వానికి పరిపాలనా సౌలభ్యం కోసం, రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి వికేంద్రీకరణ చేసేందుకు రాజధానులు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు. ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా చట్టాలు చేసుకుని పరిపాలన చేసే సౌలభ్యం ఉందన్నారు.
గతంలో హుదూద్ తుఫాన్ కారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో నష్టం వాటిల్లగా.. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు విశాఖ కేంద్రంగా పరిపాలన చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులు తాము సౌలభ్యం అనుకున్న ప్రాంతాల నుంచే పరిపాలన చేశారని, ప్రస్తుతం అలాగే కొనసాగుతుందని వైఎస్ జగన్ వివరించారు. నిర్ణయాలు తీసుకోలేని శాసనమండలి కూడా అవసరం లేదని, రద్దు చేయడం ఉత్తమమని ఏపీ సీఎం పేర్కొన్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..