గీతం యూనివర్శిటీ ( Gitam University ) పై మరో వివాదం రేగుతోంది. ఫీజులన్నీ విరాళాల రూపంలో వస్తున్నాయని..మనీ లాండరింగ్ జరుగుతోందని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ ఆరోపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) విశాఖపట్నం ( Visakhapatnam )లో దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ఉన్న గీతం యూనివర్శిటీపై ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని..నిర్మాణాలు చేసిన గీతం యూనివర్శిటిపై ఏపీ ప్రభుత్వం ( Ap Government ) చర్యలకు దిగింది. నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుండగా..గీతం యాజమాన్యం హైకోర్టులో  హౌస్ మోషన్ పిటీషన్ తో  సోమవారం వరకూ స్టే తెచ్చుకుంది.


ఇప్పుడు ఏపీ ప్రజా సంఘాల జేఏసీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. గీతం యూనివర్శిటీ అవినీతి అక్రమాలకు పాల్పడిందని..వెంటనే సిబిఐ ( CBI ), ఈడీ ( ED ) లతో విచారణ జరిపించాలని కోరుతోంది. గీతం సంస్థ.. విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల్లో అదాయం, ఫీజుల్ని విరాళాల రూపంలో తీసుకుంటోందని..ఆర్ధిక నేరాలకు పాల్పడుతుందని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు రామారావు డిమాండ్ చేశారు. మనీ లాండరింగ్ ( Money laundering ) ఆరోపణలున్నాయని..ఈడీతో విచారణ చేయించాలన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం యూనివర్శిటీను యూనివర్సిటీని స్వాధీనం చేసుకోవాలన్నారు.


విశాఖ ఎంపి నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించిన నిధులు, హుదూద్‌ తుఫాను నిధులు సైతం రాజకీయ పలుకుబడితో సంస్థకు మళ్లాయని ఆరోపించారు. ప్రభుత్వం, బ్యాంకుల నుంచి పలు రాయితీలు పొందినా..విద్యార్ధులకేనాడూ ఫీజుల్లో రాయితీ రాలేదన్నారు. గీతం సంస్థ ఇచ్చిన నకిలీ డిగ్రీలతో అనేక మంది విద్యార్థులు నష్టపోయారని కూడా చెప్పారు. ఓ పధకం ప్రకారం ఆంధ్ర యూనివర్సిటీని నాశనం చేశారని ఆరోపించారు. 


మరోవైపు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ( Ap minister Avanthi srinivas ) సైతం గీతం యూనివర్సిటీపై మండిపడ్డారు. గీతం సంస్థ ఛారిటీ సంస్థ కాదని చెప్పారు. సీట్ల కోసం లక్షలు వసూలు చేస్తోందని.. రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ పాటించరని మంత్రి స్పష్టం చేశారు. గీతం యాజమాన్యం  రుషికొండ.. ఎండాడ ప్రజలకు ఎప్పుడైనా ఫీజులు తగ్గించి ఇచ్చిందా అని ప్రశ్నించారు. మార్కెట్ ధరకు భూములు తీసుకుని, ఆ తరువాత ప్రభుత్వ భూముల్ని యూనివర్సిటీ ఆక్రమించిందన్నారు. విశాఖలో భూ బకాసురులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. నిజంగా టీడీపీ నేతలకు గీతంపై అభిమానం ఉంటే అప్పుడు ఎందుకు క్రమబద్దీకరణ చేయలేదని ప్రశ్నించారు. రుషికొండలో ఎకరం భూమి విలువ 20 కోట్లుందని.. 40 ఎకరాల విలువ 8 వందల కోట్లని చెప్పారు. ప్రభుత్వం భూమి ప్రభుత్వం తీసుకుంటుంటే గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముందని  అడిగారు మంత్రి అవంతి శ్రీనివాస్. Also read: AP: విశాఖలో మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యకలాపాలు ప్రారంభం