AP Inter Results 2023 Out: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. బుధవారం సాయంత్రం 6.30కి విజయవాడలో ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంటర్ మొదటి ఏడాదిలో 61 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. రెండో ఏడాదిలో 72 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయిగా నిలిచింది. ఈ సంవత్సరం పరీక్షలు జరిగిన 22 రోజుల్లోనే ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలికలు 65 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 58 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలో బాలికలు 75 శాతం ఉత్తీర్ణత పొందగా.. బాలురు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ నెల 27వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు బోర్డు అధికారులు అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి. మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలి. 



ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి 4,84,197 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. రెండో సంవత్సరం నుంచి 5,19,793 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇంటర్ బోర్డు కమిషనర్ ఎంవి శేషగిరి బాబు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్, జగ‌నన్న గోరుముద్ద డైరెక్టర్ నిధి పాల్గొన్నారు.


షెడ్యూల్‌ ప్రకారం నేడు సాయంత్రం 5 గంటలకు విజయవాడలో ఇంటర్‌ ఫలితాలను (AP Inter Results 2023) ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయాలి. అయితే అనంతపురం జిల్లా పర్యటనలో ఏపీ సీఎం జగన్‌తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ చేరుకోవడం ఆలస్యమైంది. దీంతో 5 గంటలకు విడుదల కావాల్సిన ఇంటర్ ఫలితాలు ఆలస్యంగా విడుదల అయ్యాయి. 


ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలతో పాటు వృత్తి విద్య కోర్సుల పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 10,03,990 మంది హాజరయ్యారు. మరోవైపు వృత్తి విద్య కోర్సు పరీక్షలకు 83,749 మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. 


Liinks:
# examresults.ap.nic.in
# http://www.manabadi.co.in/#