ఆదివారం రోజు దేశంలో వేర్వేరు చోట్ల ప్రకృతి ప్రకోపానికి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి తోడు పిడుగులకు శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది మంది, విజయనగరం జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఇద్దరు, తెలంగాణలో మంచిర్యాల జిల్లా బీమారం పండలం ఆరేపల్లిలో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అనేక మండలాలు అంధకారంలో మునిగాయి. భారీ వర్షానికి అనేకలో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఢిల్లీలో గాలివాన బీభత్సం


ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది.  గుర్గావ్, ఫరీదాబాద్, ఘజియాబాద్‌లతో పాటు పలు ప్రాంతాల్లో 109 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలితో పాటు వర్షం కురవడంతో ఇద్దరు మృతిచెందగా, మరో 18మంది గాయపడ్డారు. ఢిల్లీలో ప్రతికూల వాతావరణం వల్ల 70 విమానాలను దారి మళ్లించారు. పలు ప్రాంతాల్లో మెట్రో రైలు సేవలను నిలిపివేశారు. ఆదివారం మధ్యాహ్నం మొదలైన ఈ బీభత్సం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల చెట్ల కొమ్మలు, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుతు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఏర్పాటు చేసు కున్న బహిరంగ కార్యక్రమం ఈదురుగాలుల బీభత్సానికి రద్దు చేసుకోవాల్సి వచ్చింది.



 


 



ఉత్తరప్రదేశ్‌లో గాలి భీభత్సం, భారీ వర్షాల కారణంగా 18 మంది చనిపోగా, 25 మంది గాయపడ్డారు.  



 


పశ్చిమ బెంగాల్‌లో..


పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. కోల్‌కతాలో కురిసిన వర్షం కారణంగా పడిన పిడుగుల వల్ల 8మంది చనిపోయారు. పిడుగుపడి చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.



 


ఎండలూ అలానే


కోస్తాంధ్ర, రాయలసీమలో ఆదివారం ఎండతీవ్రత ఎక్కువగానే ఉంది. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత నమోదయింది. ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి:  తూర్పు గోదావరి- 43.6 డిగ్రీలు, అనంతపురం 39.4, చిత్తూరులో 41.8, గుంటూరు 43.4, కడప 42.4, కృష్ణా 42.7, కర్నూలు 42.2, నెల్లూరు 42.5, ప్రకాశం 42.5, శ్రీకాకుళం 37.8, విజయనగరం 38.7, విశాఖ 40.4, పశ్చిమ గోదావరి 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


రానున్న 24 గంటల్లో


రానున్న 24 గంటల్లో తెలంగాణ,కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఈసారి నైరుతి రుతుపవనాలు నాలుగురోజుల ముందే  కేరళను తాకుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 28వ తేదీన కేరళను రుతుపవనాలు తాకుతాయని, 20 నాటికి అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకుతాయన్నది వాతావరణ శాఖ నిపుణుల అంచనా.