కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లోనే అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తోన్న ఆంధ్రప్రదేశ్‌కి ఇది మరో బ్యాడ్ న్యూస్. అటల్ మిషన్ ఫర్ రెజ్వెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) సిటీ ప్రాజెక్ట్ పథకం కింద వైజాగ్‌కి అందించాల్సిన నిధులని కేంద్రం నిలిపేసినట్టు తెలుస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను కేటాయించాల్సి వున్న నిధులకి సంబంధించి, ఏపీ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల్లో ఒకటైన రూ.100 కోట్ల నిధులని కేంద్రం ప్రకటించకపోవడానికి కారణం అదేనని తెలుస్తోంది. 


ఇదిలావుంటే, కేంద్రం వైజాగ్‌కి నిధులు నిలిపేయడానికి కారణం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరే అని ఏపీకి చెందిన బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. నిర్ణీత సమయంలో మునిసిపాలిటీ ఎన్నికలు నిర్వహించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, మునిసిపల్ బాడీనే లేదు కనుకే ఆర్థిక సంఘం వైజాగ్ కి నిధులు కేటాయించలేదని ఏపీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా వైజాగ్ అభివృద్ధికి కీలకమైన నిధులు ఆగిపోవడం మాత్రం బాధాకరం అంటున్నారు వైజాగ్ వాసులు.