అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తర్జనభర్జనలు జరుగుతుండగానే ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటన చర్చనియాంశమైంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న అమరావతిని చట్టసభలకు రాజధానిగా, ప్రభుత్వ కార్యకలాపాల కోసం విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా, కర్నూలును జ్యుడీషియల్ కేపిటల్‌గా చేసే అవకాశం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఓ నిపుణుల కమిటీని కూడా నియమించామని.. 10 రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇస్తుందని సీఎం జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏపీకి మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందని అసెంబ్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సంచలన ప్రకటనను ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.      


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదొక తుగ్లక్ నిర్ణయం.. జగన్ ఎక్కడ కూర్చుని పాలిస్తారు ? : జగన్ ప్రతిపాదనపై బాబు విమర్శలు
ఏపీ సీఎం జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ విమర్శించింది. అమరావతిపై అక్కసుతో లేదా తనపై అక్కసుతోనే ఇలాంటి ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చిన జగన్ ఎక్కడ కూర్చుని పరిపాలన అందిస్తారని ప్రశ్నించారు. అమరావతిలో కూర్చుంటారా ? విశాఖలో కూర్చుంటారా ? కర్నూలులో కూర్చుంటారా ? అని ప్రశ్నించారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తుగ్లక్ నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఈ ప్రతిపాదన వల్ల ప్రజలు జిల్లాలు తిరగాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రాంతీయ విభేదాలు తలెత్తే అవకాశం ఉందని విమర్శించారు. నిపుణల కమిటీ నివేదిక రాకముందే నిర్ణయం ప్రకటించడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. సీఎం జగన్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ మరింత వెనుకబడుతుందని విమర్శించారు. 


విశాఖలో వైసిపి నేతలకు భూములు..
అమరావతిలో ఆస్తుల విలువ పెరుగుతుంది కనుకే దాన్ని చంపేయాలని చూస్తున్నారన్నారని... విశాఖపట్నంలో వైసీపీ నేతలు భూములు కొంటున్న నేపథ్యంలోనే జగన్ ఈ స్కెచ్ వేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్, బెంగళూరు అభివృద్ధి అవుతాయి తప్ప.. ఏపీకి ఒరిగేదేం లేదన్నారు. హైదరాబాద్‌లో తన ఆస్తుల విలువ పెంచుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పిచ్చోడి చేతికి రాయి ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి తయారైందని విమర్శించారు.     


సౌతాఫ్రికాకు 3 రాజధానులు.. ఏపీకి మూడు రాజధానులు..  
ప్రపంచవ్యాప్తంగా మూడు రాజధానులు ఉన్న ఏకైక దేశం దక్షిణాఫ్రికా. ఈ దేశానికి మూడు రాజధానులు ఉన్నాయి. అవి ప్రిటోరియా, కేప్ టౌన్, బ్లూమ్ ఫోంటీన్. ప్రిటోరియా ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ఉండగా.. కేప్ టౌన్ లెజిస్లేటివ్‌గా.. బ్లూమ్ ఫోంటీన్.. జ్యుడీషియల్ కేపిటల్‌గా ఉంది. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నట్లుగానే.. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో అన్నారు. జగన్ వ్యాఖ్యలను పరిశీలిస్తే... సౌతాఫ్రికా కేపిటల్స్‌కు సంబంధించిన దానిపై కొంత అధ్యయనం చేసినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా రెండు రాజధానులు ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి. కేపిటల్స్‌ను ఇలా విభజించడం వల్ల పరిపాలన వికేంద్రీకరణ జరిగి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించారు. ఐతే మున్ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.