కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్య పోటీ కాంగ్రెస్, బిజేపీ, జేడీఎస్ (జనతాదళ్ సెక్యులర్) మధ్య ఉండనుంది. బీజేపీ పార్టీ ఇప్పటికే ఉత్తరాది నుంచి పార్టీ ముఖ్య నాయకులను రప్పించి ప్రచారం చేయిస్తూ ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను  కూడా రంగంలోకి దించింది. ఇక మిగతా పార్టీలు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన తమ పార్టీల నాయకుల చేత ఎన్నికల ప్రచారం చేయించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయని సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల నాయకుల మీద కన్నేసిందని సమాచారం. కర్నాటకలో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో వీరి చేత ప్రచారం చేయించాలని కాంగ్రెస్ అనుకుంటున్నదట. సినీ గ్లామర్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి చేత ఎన్నికల ప్రచారం చేయించాలని కర్నాటక కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారని పలు వార్తలు వస్తున్నాయి.


అలాగే తెలుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో, బెంగళూరులో సెటిల్ అయిన తెలుగువాళ్లు ఉన్న ప్రాంతాల్లో చిరంజీవితో ప్రచారం చేయించే అవకాశం ఉందనేది పలువురి అభిప్రాయం. చిరంజీవి కాంగ్రెస్ ఎంపీ కాబట్టి.. ఇందుకు ఆయన అభ్యంతరం తెలపకపోవచ్చని కూడా కొందరు నాయకులు చెబుతున్నట్లు సమాచారం. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే తప్పక ప్రచారం చేస్తారు కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఆ దిశగా పావులు కదిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా ఇందుకు సుముఖంగా ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి.


ఇదిలా ఉండగా.. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా అక్కడి రాజకీయ పార్టీలు కన్నేశాయని సమాచారం. ఈ క్రమంలో జేడీఎస్ పవన్ కల్యాణ్‌తో ఎన్నికల ప్రచారం చేయించుకునే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. గతంలో జేడీఎస్ ముఖ్యనాయకుడు కుమారస్వామిని పవన్ కలవడంతో ఇలాంటి వార్తలు వస్తున్నాయి.


పవన్ కల్యాణ్‌ను తమ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి ఆహ్వానిస్తామని కుమారస్వామి చెప్పినట్లు కూడా కొందరు అంటున్నారు. పవన్ కల్యాణ్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేకి అని.. అందుకే తమ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని కుమారస్వామి చెప్పినట్లు కూడా కొందరు చెవి కోసుకుంటున్నారు. అయితే గతంలో జేడీఎస్ పార్టీ ప్రతినిధి రమేష్ బాబు మాట్లాడుతూ, పవన్ తమకు ప్రచారం చేస్తారని కూడా చెప్పినట్లు కొన్ని ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చాయి. మొత్తానికి.. ఇందులో నిజం ఎంత ఉందన్న విషయం పక్కన పెడితే.. ఎన్నికల్లో మెగా బ్రదర్స్ చేత ప్రచారం చేయించి కర్ణాటక రాజకీయ ప్రముఖులు ఓట్లు దండుకొనే పనిలో పడినా ఆశ్చర్యపోనక్కర్లేదనేది మరో వాదన