Cm Chandra babu Naidu: కూటమి సర్కార్‌ కొలువుదీరాక వైసీపీ యాక్టివిస్టుల అరెస్టుల పర్వం నడుస్తోంది. ఫ్యాన్ పార్టీలో యాక్టివ్‌గా వుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారికి నోటీసులు ఆ వెంటనే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే  57 మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇన్నాళ్లు రాజకీయ నాయకులకే పరిమితం అయినా ఈ అంశం.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీని తాకింది. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్టమురళి, నటి శ్రీరెడ్డిలకు నోటీసులు ఇచ్చి అరెస్టులు చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు.. పార్టీ అండదండలు చూసుకుని ఆ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌లపై పరుషమైన పదజాలంతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ అరెస్టుతో వైసీపీ యాక్టివిస్టులకు భయం కలిగేలా కూటమి ప్రభుత్వం చేసింది. వైసీపీ సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేనలను టార్టెగ్‌ చేస్తూ పోస్టులు పెట్టించారనే  కారణంతో సోషల్ మీడియా ఇంఛార్జ్  వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు జగన్ చేపట్టిన పాదయాత్ర మొదలుకుని, 2019లో అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాల్లో వచ్చిన మార్పుల ఆధారంగా అమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే పేరుతో రామ్ గోపాల్ వర్మ సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబును దారుణంగా కించపరిచారని సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద పలు కేసులు నమోదయ్యాయి. సినిమా టైటిల్ నుంచి సెన్సార్ అయ్యేవరకు పలు వివాదాల మధ్యన ఆ సినిమాని విడుదల చేశాడు. ఆ సినిమాలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టీడీపీ పార్టీ నేతలు చర్చించుకున్న విధానాలను ఎక్కువగా టార్గెట్‌గా చేసి సినిమాలో చూపించారు. ఆ సినిమా విడుదల తరువాత టీడీపీ శ్రేణులు చాలా నిరాశకు గురి కావడం జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ మోహన్ రెడ్డి అరెస్టుకు కారణమయిన సంఘటనలను బేస్ చేసుకుని వ్యూహం సినిమాని 2023లో తెరకెక్కించారు. వ్యూహం సినిమాలో జగన్ అరెస్టుకు వెనుక వున్న కుట్రదారులను చూపిస్తూ ఆ సినిమాని రూపొందించారు. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా ఓ సినిమాని తెరకెక్కించి నిత్యం వివాదంలో ఇరుక్కున్నారు రామ్ గోపాల్ వర్మ. మరోవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌ను కించపరిచే విధంగా ఎక్స్ వేదికగా రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ ఫోటోలు, పోస్టులు పెడుతున్నారని ఆయనపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకుని విచారణకు హాజరు కావాలంటూ మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌ అయ్యింది.


ఇక సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి వైసీపీలో కీలక లీడర్‌గా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పలు జిల్లాల్లో ప్రచారం కూడా చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పోసాని సేవలను గుర్తించి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్‌గా నియమించారు. దాంతో వైసీపీ తరపున మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి టీడీపీ, జనసేన అధినేతలపై విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలు, పవన్ మూడు పెళ్ళిళ్ళ గురించి వివాదకరమైన వ్యాఖ్యలు చేశారు. పోసాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాజమహేంద్రవరానికి చెందిన జనసేన సైనికులు ఆయనపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఆ కేసును పోలీసులు పట్టించుకోవడం లేదని జనసేన సైనికులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశంతో 2022లో పోసానిపై రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసును తెరమీదకి తీసుకువచ్చి పోసానికి నోటీసులు పంపారు.


మరోవైపు టాలీవుడ్ నటి శ్రీరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీకి సపోర్టు చేస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత మీద తీవ్రమైన పదజాలంతో సోషల్ మీడియా వేదికగా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లాకి చెందిన టీడీపీ మహిళా నాయకురాలు నటి శ్రీరెడ్డిపై కేసు పెట్టారు. దాంతో శ్రీరెడ్డి దెబ్బకి దిగొచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో చేసిన తప్పులకు ప్రయాశ్చిత్తం కోరుతూ తాజాగా సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డి ఓ పోస్టు పెట్టారు. ఇన్నాళ్లుగా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లను తిడుతూ పోస్టులు పెట్టిన శ్రీరెడ్డి... తాజాగా పెట్టిన పోస్టులో వారిపై చేసిన విమర్శలకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోని పోస్టు చేశారు. వైసీపీ కార్యకర్తలు ఎవరూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టవద్దంటూ అభ్యర్థించారు. అయితే ఇన్నాళ్లు బండాబూతులు తిట్టిన శ్రీరెడ్డి ఇప్పుడు యూ టర్న్‌ తీసుకోవడంపై టీడీపీ మహిళ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఎలాగైనా సరే శ్రీరెడ్డిని కటాకటాల వెనక్కి పంపాలని డిమాండ్‌ చేస్తున్నారు.


అటు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు ఎలాంటి వ్యక్తులకు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. కొందరి పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయన్నారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. వాళ్లు పెట్టిన పోస్టులపై కోర్టు కూడా మొట్టికాయలు వేసిందన్నారు. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం చేశారని.. ఆ తర్వాత పోస్టులు డిలీట్‌ చేశారని చెప్పారు. అయినా, వారిని వదిలిపెట్టం.. కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.  మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరన్నారు.  సొంత తల్లిని, చెల్లిని తిట్టినవారిని జగన్‌ ఏంచేయలేకపోయారన్నారు. మీ తల్లిని, చెల్లిని తిట్టిన వారిని మేం అరెస్టులు చేస్తున్నాం అని హోం మంత్రి తెలిపారు.


ఇదిలా ఉంటే ఏపీ కాంగ్రెస్ పీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల సైతం వైసీపీ సోషల్ మీడియాపై తీవ్రంగా స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతోనే  వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విజయమ్మపై, తనపై చాలా నీచంగా పోస్టులు పెట్టారని విమర్శించారు. వైసీపీ సోషల్‌ మీడియాపై చర్యలు తీసుకోవాలంటే పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మరోవైపు గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు తీవ్రమైన పదజాలంతో రెచ్చిపోయారని కూటమి నాయకులు ఆగ్రహంతో వున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన అధినేతలపై తీవ్రంగా దూషణలకు పాల్పడ్డ మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా  తొందరలో చర్యలు వుంటాయని తెలుస్తోంది. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత హననానికి పాల్పడ్డ ఎవరిని వదిలిబెట్టబోమని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి దిన సీనియర్ నాయకులు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Also Read: Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవు.. ఒక్క రోజు డుమ్మా కొడితే మూడు రోజులు పండగే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.