నోటీసులు వస్తే కోర్టుకు వెళ్తాం: నారా లోకేశ్
కోర్టు నోటీసులిస్తే.. చంద్రబాబు కోర్టుకు వెళ్తారని ఏపీ పంచాయితీ రాజ్, ఐటీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
కోర్టు నోటీసులిస్తే.. చంద్రబాబు కోర్టుకు వెళ్తారని ఏపీ పంచాయితీ రాజ్, ఐటీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.2010లో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. దీనివల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని.. ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నాడు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. అప్పట్లో 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుత తెలంగాణ) సరిహద్దును దాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబుతో పాటు 40మంది ఎమ్మెల్యేలను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్ కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. ఇటీవలే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి పిటిషన్ వేయడంతో మళ్లీ బాబ్లీ కేసు తెరపైకి వచ్చింది.
బాబ్లీ కేసులో త్వరలో చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు ఇవ్వనున్నట్లు హిందీ దినపత్రికలో గురువారం కథనం వెలువడింది. ఈ వ్యవహారంపై మంత్రి లోకేశ్ స్పందించారు. బాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు అందితే చంద్రబాబు, టీడీపీ నేతలు కోర్టుకు వెళ్తారని చెప్పారు.