జగన్ పాదయాత్రలో అపశ్రుతి
పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు క్రాస్ రోడ్డు వద్ద వైసీపీ ప్రజాసంకల్ప యాత్రలో తేనెటీగలు కలకలం సృష్టించాయి.
పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు క్రాస్ రోడ్డు వద్ద వైసీపీ ప్రజాసంకల్ప యాత్రలో తేనెటీగలు కలకలం సృష్టించాయి. వైకాపా అధినేత, ఏపీ విపక్ష నేత జగన్ వెంట పాదయాత్ర చేస్తున్నవారిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో 12 మంది వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఓ ఆకతాయి అక్కడే ఉన్న తేనెతుట్టెను రాయితో కొట్టడంతో తేనెటీగలు దాడికి దిగాయి. దీంతో పాదయత్రకు వచ్చిన కార్యకర్తలు పరుగులు పెట్టారు. పాదయాత్రలో ఉన్న జగన్‌పై తేనెటీగలు దాడి చేయకుండా ఆయన సెక్యూరిటీ అధికారులు రక్షణగా నిలిచి అక్కడి నుంచి తరలించారు.
జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర నేడు 183వ రోజుకు చేరుకుంది. ఈ రోజు నిడదవోలు నియోజకవర్గం నడిపల్లికోట శివారు నుంచి జగన్ తన 183వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి కానూరు క్రాస్ రోడ్డు వరకూ పాదయాత్ర కొనసాగించి.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి అనంతరం రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంది.