Ys Jagan Mohan Reddy: బాధ పడకండి.. అందరిని ఏరి ఏరి జైల్లో పెడతాం.. మాజీ సీఎం జగన్ సంచలనం
YS Jagan Fires on CM Chandrababu Naidu: టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అక్కాచెల్లళ్లమ్మలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని.. నిందితులు టీడీపీకి చెందిన వారు కావడంతో ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు.
YS Jagan Fires on CM Chandrababu Naidu: లైంగిక వేధింపులకు గురై గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ప్రాణం కోల్పోయిన సహానా కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితి ఉందనడానికి.. శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారిందని చెప్పడానికి, ఓ దళిత చెల్లి పరిస్థితి చూస్తే అర్ధమవుతుందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆడబిడ్డలకు ఏ ఆపద వచ్చినా కాపాడేందుకు దిశ యాప్ ఉండేదని.. ఏ ఆపద వచ్చినా వచ్చినా ఒక్క బటన్ నొక్కినా.. ఐదుసార్లు ఫోన్ ఊపినా ఐదు నిమిషాల్లో పోలీసులు వచ్చేవారని అన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. నిందితుడు నవీన్ అనే వ్యక్తి చంద్రబాబుతో దిగిన ఫోటోలు ఉన్నాయని.. స్థానిక ఎంపీతో సన్నిహితంగా కూడా ఉన్నాడని అన్నారు. బాధితురాలిని కారులో తీసుకుని వెళ్లి.. శారీరంగా వేధించారని, శరీరమంతా కందిపోయిన గుర్తులు ఉన్నాయన్నారు.
ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం తాము తోడుగా ఉన్నామని చెప్పాలని.. తప్పు ఎవరు చేసినా కచ్చితంగా శిక్ష పడుతుందని భరోసానివ్వాలని జగన్ అన్నారు. బాధితురాలి శరీరంపై స్పష్టంగా గాయాలు కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి వచ్చి, తప్పు జరిగిందని అడగడం లేదన్నారు. అన్ని రకాలుగా ఆదుకుంటూ, పరిహారం ఇచ్చి తోడుగా నిలబడలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి ఈ ఘటనపై అసలే స్పందించలేదని.. చేసినవాడు తమ మనిషి కాబట్టి, నిస్సిగ్గుగా కాపాడే ప్రయత్నం జరుగుతోందన్నారు.
"ఇక్కడి నుంచి నేను బద్వేలుకు పోతున్నాను. అక్కడా ఇలాంటి ఘటనే. 16 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత పెట్రోల్ పోసి కాల్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అతి దారుణంగా వారి కూల్‌డ్రింక్స్‌లో మందు కలిపి, వారిపై అత్యాచారం చేసిన ఘటన. అది చేసిన వారెవరు అంటే, టీడీపీకి చెందిన ప్రబుద్ధులు. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ నాయకులు. వారి పిల్లలు. బరి తెగించి, మేం ఏం చేసినా, మమ్మల్ని ఎవరూ తాకలేరన్న ధీమాతో, ఇద్దరు ఆడపిల్లలను బర్త్‌డే పార్టీ అని చెప్పి, తీసుకుపోయి, కూల్‌డ్రింక్‌లో మందు కలిపి అత్యాచారం చేసిన ఘటన. మరి దాన్ని ఒప్పుకుని క్షమాపణ చెప్పాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోంది.
స్థానిక మంత్రులు, ఎమ్మెల్యే ఇన్‌వాల్వ్ అయి, పంచాయతీ చేసి, దీన్ని బ్రషప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు. ఆయన భార్య కార్పొరేటర్. ఆ టీడీపీ నాయకుడు ఒక 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి, ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయి అత్యాచారం చేసి వదిలేస్తే, అక్కడ చెత్త ఏరుకునే వారు ఆ బాలిక ప్రాణాలు కాపాడారు. లోకేష్, అచ్చెన్నాయుడితో ఆ పెద్దమనిషి ఫోటో. డిప్యూటీ సీఎం కనీసం ఆ పాప ఇంటికైనా వెళ్లాడా? పరామర్శించాడా? హిందూపురంలో దసరా పండగ రోజున అత్తాకోడలిపై గ్యాంగ్‌రేప్ జరిగింది. నిందితులను అరెస్టు చేయలేదు. మూడు రోజుల పాటు వారిని అరెస్టు చేయాలన్న కనీస ఆలోచన కూడా రాలేదు. అక్కడి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఆయన బాధితులను కనీసం పరామర్శించలేదు. వారిని కలవలేదు. ఆయన స్వయంగా సీఎంకు బావమరిది.
అనకాపల్లిలో రాంబల్లి మండలం, కుప్పగొండుపాలెంలో 9వ తరగతి చదువుతున్న బాలికను టీడీపీ నాయకుడు సురేష్.. ప్రేమోన్మాది నరికి చంపాడు. గతంలో ఆ సురేష్ వేధిస్తే, ఫిర్యాదు చేస్తే అరెస్టు చేసి జైలుకూ పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చి, మళ్లీ వేధించాడు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో బిజీగా ఉన్న పోలీసులు, పట్టించుకోకపోవడంతో, సురేష్, ఆ పాపను దారుణంగా చంపాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర నెలల్లోనే.. ఏకంగా 77 మంది మహిళలు, పిల్లల మీద ఈ మాదిరిగా దారుణమైన అత్యాచారాలు. ఏడుగురు హత్యకు గురి కాగా, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ వారు ఏ తప్పు చేసినా, మీరు చేయండి. మేము వెనకుసుకొస్తాం. మీకేమీ జగరనివ్వం. అని చెప్పి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి, చంద్రబాబుగారు దగ్గరుండి చంద్రబాబుగారు ప్రోత్సహిస్తున్న పరిస్థితి. ఈ మాదిరిగా జరుగుతూ, జరుగుతూ, శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారుతున్నాయో, ఒకసారి గమనించండి.
నారా లోకేష్. ఈ మనిషికి బుద్ధి తక్కువ. జ్ఞానం తక్కువ. ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు. బుద్ధి ఉన్న వాడెవడైనా దిశ చట్టాన్ని, యాప్‌ను కాల్చేస్తారా? మంచి చేసే దీన్ని ఎవడైనా కాల్చేస్తాడా? చెప్పండి. బుద్ధి లేని ఈ మనిషికి, పప్పు లాంటి ఈ మనిషికి పక్కనున్న వ్యక్తి ఎవరు అంటే, హోం మంత్రి. ఇద్దరూ కలిసి, దిశ చట్టం, దిశ యాప్ కాల్చేస్తున్న ఫోటో ఇది.. ఇంతటి దారుణంగా వీళ్ల ప్రవర్తన. ఇంత దారుణంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి. ఒకవైపు అక్కచెల్లెమ్మలకు ఏమీ చేయకుండా చంద్రబాబు మహిళా సమాజాన్ని నీరు గార్చాడు. వారికి ఇస్తానన్నది ఏదీ ఇవ్వలేదు. అక్కచెల్లెమ్మలు ఈ రాష్ట్రంలో బ్రతికే పరిస్థితి లేకుండా చేశాడు." అని జగన్ ఫైర్ అయ్యారు.
జరుగుతున్న ఘటనలకు క్షమాపణలు చెప్పాలని సీఎం చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. ప్రతి బాధితుడి వద్దకు మంత్రులను పంపించి, రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటన జరగవని లెంపలు వేసుకోవాలని.. లేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడు అవుతాడని అన్నారు. జరిగిన ఈ ఆరేడు ఘటనల్లో, చంద్రబాబు స్పందించినా లేకపోయినా, తమ పార్టీ నుంచి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామన్నారు. బాధితులు బాధ పడకండని.. వచ్చేది మన ప్రభుత్వమేనని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరినీ ఏరి ఏరి జైల్లో పెడతామని స్పష్టం చేశారు.