చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామపురంలో గురువారం సాయంత్రం అధికార లాంఛనాల మధ్య టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అంత్యక్రియలు ముగిశాయి. ముద్దుకృష్ణమ నాయుడు స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున ఏపీ మంత్రులు పుల్లారావు, దేవినేని ఉమ, అమర్‌నాథ్‌రెడ్డి, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. వీరితోపాటు టీడీపీ సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ముద్దు కృష్ణమనాయుడి అంతిమయాత్రలో పాల్గొన్నారు. 
 
డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ముద్దుకృష్ణమ నాయుడు.. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి దాటాకా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. పార్టీకి సీనియర్ నాయకుడిగా, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నత విద్యాశాఖ, విద్యాశాఖ, అటవీశాఖ మంత్రిగా సేవలు అందించిన ముద్దుకృష్ణమ మృతి పార్టీకి తీరని లోటు అని టీడీపీ ఓ ప్రకటనలో పేర్కొంది. 1947 జూన్‌ 9న వెంకట్రామాపురంలో జి.రామానాయుడు, రాజమ్మ దంపతులకు జన్మించిన ముద్దుకృష్ణమ.. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అధ్యాపక వృత్తిలో చేరారు. అనంతరం 1983లో ఎన్టీఆర్‌ పిలుపు మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించి టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగిన ముద్దుకృష్ణమ.. పార్టీలో పలు కీలక హోదాల్లో పనిచేశారు.