టిక్ టాక్ వీడియోలు చేస్తోందని భార్య హత్య, పెట్రోల్ పోసి దహనం
టిక్ టాక్ వీడియోలు భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తోన్న వైనం ఆందోళనకు గురిచేస్తోంది. భార్య తన ఇష్టానికి వ్యతిరేకంగా టిక్ టాక్ వీడియోలు(Posting TikTok videos) పోస్ట్ చేస్తోందనే ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి.. ఆమెను హతమార్చి.. శవాన్ని స్మశానవాటికలో దహనం చేశాడు.
గుంటూరు: టిక్ టాక్ వీడియోలు భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తోన్న వైనం ఆందోళనకు గురిచేస్తోంది. భార్య తన ఇష్టానికి వ్యతిరేకంగా టిక్ టాక్ వీడియోలు పోస్ట్(Posting TikTok videos) చేస్తోందనే ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి.. ఆమెను హతమార్చి.. శవాన్ని స్మశానవాటికలో దహనం చేసిన మరో ఘటన తాజాగా గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. నవంబర్ 17న పది రోజుల కిందట జరిగిన ఈ మర్డర్ కేసు మిస్టరీని తాజాగా పోలీసులు ఛేదించారు. సిద్దల చిననర్సయ్యకు, గొర్రపాటి సువార్తకు ఐదేళ్ల క్రితమే వివాహమైంది. ఇద్దరూ ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్లద్దరికి రెండేళ్ల పాప కూడా ఉంది. కాపురం సజావుగానే సాగిపోతుందనుకుంటున్న సమయంలో వారి సంసారంలో టిక్ టాక్ యాప్ చిచ్చుపెట్టింది. సువార్తకు టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేసే అలవాటు ఉండటంతో ఆ అలవాటు మానుకోవాల్సిందిగా భర్త చిన్ననర్సయ్య మందలించాడు. అయినప్పటికీ ఆమె అలవాటు మానుకోలేదు. దీనికితోడు సువార్త ప్రవర్తనపై అనుమానం కూడా పెంచుకున్నాడు నర్సయ్య.
ఈ క్రమంలోనే భర్త దగ్గర నుంచి వెళ్లిపోయి తన కూతురిని తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టిన సువార్త.. సత్తెనపల్లిలోని ఓ హాస్టల్ ఉంటోంది. దీంతో తిరిగి ఇంటికి రావాల్సిందిగా చిన్ననర్సయ్య నవంబర్ 14న తన భార్య సువార్తను కోరినప్పటికీ.. ఆమె మాట వినకపోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. నవంబర్ 17న తన తమ్ముడు చిన్న వెంకయ్యతో కలిసి సువార్తను హత్య చేసిన చిన్ననర్సయ్య.. ద్విచక్రవాహనంపై శవాన్ని తీసుకెళ్లి సావల్యపురం సమీపంలోని పొట్లూరు స్మశానవాటికలో శవానికి నిప్పుపెట్టి దహనం చేశాడు.
స్మశానవాటికలో గుర్తుతెలియని శవం దహనం చేసి ఉందని ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. శవం వద్ద లభించిన ఆభరణల ఆధారంగా మృతురాలు ఎవరనేది గుర్తుపట్టారు. అదే క్రమంలో స్థానిక పెట్రోల్ బంకులో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు.. నవంబర్ 17న రాత్రి వేళ బాటిల్‌లో పెట్రోల్ కొనుగోలు చేసింది చిన్ననర్సయ్య ఒక్కడేనని నిర్ధారించుకున్నారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టగా.. నిందితుడు నిజం అంగీకరించాడు. దీంతో చిన్న నర్సయ్యతో పాటు అతడికి సహకరించిన సోదరుడు చిన్న వెంకయ్యను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.