రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని.. ఈ క్రమంలో పెట్రోల్‌ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం గర్హనీయమని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదిన దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్తాళ్‌‌కి జనసేన మద్దతు తెలుపుతుందని తెలియజేశారు. ఈ హర్తాళ్‌లో జనసేన పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా పాల్గొంటారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఈ హర్తాళ్‌లో జనసేన కార్యకర్తలను పాల్గొనమని కోరినందుకు పవన్.. సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామక్రిష్ణతో పాటు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల పదవ తేదీన జరగబోయే జాతీయస్థాయి హర్తాళ్‌కు, బంద్‌కు వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. అందులో సమాజ్‌వాది , డిఎంకె, బిఎస్‌పి, ఎన్‌సిపి. ఆర్‌జెడి, జెడి(ఎస్‌), జెవిఎం, జెఎంఎం, ఆప్‌ పార్టీలు కూడా ఉన్నాయి. 


ప్రస్తుతం ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.39కు చేరగా ..  డీజిల్‌ ధర రూ.76.51కి చేరింది. అలాగే విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ.85.96, డీజిల్‌ లీటర్‌ రూ.79.22 రూపాయలకు చేరింది. ఈ క్రమంలో వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ పేరిట సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయని విమర్శించారు. 2019 నాటికి లీటరు పెట్రోల్‌ రూ.100 చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారు ఈ సందర్భంగా తెలిపారు.