తెలంగాణలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొనేందుకు సీపీఎం పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు బుధవారం సీపీఎం నాయకులు, పవన్ కళ్యాణ్‌తో కలిసి భేటి అవ్వడానికి సంసిద్ధమవుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి అడుగులు వేసే అవకాశం మీదే చర్చించినట్లు.. అందుకు పవన్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు పలు పత్రికలు వార్తలు కూడా రాయడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలోని కీలక సభ్యులతో సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా సమావేశం అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాబోయే ఎన్నికల్లో పలు చోట్ల ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేసే అవకాశం ఉంటుందని కూడా ఈ విషయం ద్వారా అర్థమవుతోంది. గత నెల జనసేనతో కలిసి పనిచేయాలన్న అభిలాష ఉన్నట్లు స్వయాన సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 


ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేక హోదాకు సంబంధించిన పోరాటాల్లో గతంలో జనసేనతో పాటు సీపీఎం, సీపీఐ పార్టీలు కలిసి పాల్గొన్నాయి. కొద్ది నెలల క్రితం సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విభజన హామీలు, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలు, కడప ఉక్కు...ఇలాంటి అనేక పెండింగ్ సమస్యలపై కలిసి పోరాడాలని పవన్‌తో అన్నారు.