టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ మనసు మార్చుకున్నారు. తనపై కొందరు దుష్ప్రచారం చేశారని.. కానీ టీడీపీ నేత చంద్రబాబు తనతో మాట్లాడాక మనసు మార్చుకున్నానని ఆయన అన్నారు. పార్టీకి మచ్చ రాకూడదని తను భావిస్తున్నానని.. కాబట్టే ఢిల్లీ వెళ్లి ఓటింగ్‌లో పాల్గొని... మోదీ సర్కారుకి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకుంటున్నానని జేసీ తేల్చి చెప్పారు. అయితే ఓటింగ్ అయిపోయాక తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి పార్టీలో లభిస్తున్న గౌరవం కూడా తనకు దక్కడం లేదని జేసీ బాధపడుతున్నారని ఈ సందర్భంగా ఆయన అనుయాయులు కొందరు అంటున్నారు. నిన్నటి వరకూ అసలు సభకు హాజరు కానని చెప్పిన జేసీ వ్యవహారంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


ఏదేమైనా.. జేసీ దివాకర్ రెడ్డి ఓటింగ్‌లో పాల్గొంటానని చెప్పడంతో.. తెలుగుదేశం పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క రోజు క్రితమే కేంద్రంపై టీడీపీ పెట్టే అవిశ్వాసం వీగిపోతుందని తెలిపిన జేసీ.. 24 గంటలు గడవకముందే మాట మార్చారు. విప్ జారీ చేసినా సభకు వెళ్లేది లేదని చెప్పిన ఆయన.. ఇప్పుడు వెళ్లి ఓటు వేస్తానని చెప్పడంతో తెదేపా శ్రేణులు ఉపశమనాన్ని పొందాయి.


అయితే జేసీ దివాకర్ రెడ్డి పార్టీని బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఇలా రాజీనామా నాటకం ఆడుతున్నారని కూడా పలు పత్రికలు వార్తలు రాశాయి. అలాగే రాజకీయాల్లోకి తన కుమారుడిని తీసుకురావాలని జేసీ భావిస్తున్నా.. టికెట్ ఇవ్వడానికి తెలుగుదేశం అధిష్టానం ఒప్పుకోకపోవడం వల్ల కూడా జేసీ అలక వహించారని పలువురు అంటున్నారు. ఏదేమైనా.. జేసీ తన సొంత పార్టీ మీద చేసిన తిరుగబాటుపై రాజకీయ శ్రేణుల్లో వాడీవేడిగానే చర్చ జరిగింది.