తెలంగాణలో స్వతంత్ర అభ్యర్థులకే ఈ సారి జనం పట్టం కడతారు: లగడపాటి జోస్యం
ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకే ప్రజానీకం పట్టం కడతారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు.
ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకే ప్రజానీకం పట్టం కడతారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై జనాలు ఆగ్రహంతో ఉన్నారని.. కనుక స్వతంత్ర అభ్యర్థులకే జనం పట్టం కట్టే అవకాశం ఉందని లగడపాటి తెలియజేశారు. నారాయణ్‌పేట్ (మహబూబ్ నగర్) , భోథ్ (ఆదిలాబాద్‌లో ఇండిపెండెంట్లు గెలుస్తారని కూడా లగడపాటి అన్నారు. తెలంగాణలో పోలింగ్ జరగగానే గెలిచే అభ్యర్థుల పేర్లను తన సర్వేలో భాగంగా తెలియజేస్తానని లగడపాటి వెల్లడించారు.
ప్రతీ రోజు ఇద్దరి పేర్లను లీక్ చేస్తానని.. తన మాటలు అక్షర సత్యాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తన ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదని.. కేవలం రాజకీయ విశ్లేషణ చేసి మాత్రమే ఈ మాటలు అంటున్నానని లగడపాటి స్పష్టం చేశారు. ఈ సారి దాదాపు 10 నుండి 8 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు తెలంగాణలో గెలుస్తారని.. అధికార పార్టీకి సవాలు విసురుతారని లగడపాటి తెలిపారు.
విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికైన లగడపాటి, లాంకో గ్రూపు అధినేతగా ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 13 ఫిబ్రవరి 2014 తేదిన లోకసభలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) ను ప్రవేశ పెట్టిన సమయంలో లగడపాటి పెప్పర్ స్ప్రే చేసిన విషయం దేశంలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు.