Chiranjeevi: ప్రధాని మోడీ సభలో చిరంజీవి.. ఆయనే టార్గెట్టా? బీజేపీతో అట్లుంటది మరీ..
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. పొత్తుల విషయంలో పార్టీల వాయిస్ రోజుకోలా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీ సభలో పాల్గొన్నారు.
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. పొత్తుల విషయంలో పార్టీల వాయిస్ రోజుకోలా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీ సభలో పాల్గొన్నారు. కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ భీమవరం సభకు హాజరయ్యారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి.. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. జగన్, చిరంజీవి కలిసి ప్రధాని మోడీతో వేదిక పంచుకోవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికి ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు చిరంజీవి. 2009 ఎన్నికల్లో 18 ఎమ్మెల్యే సీట్లు సాధించారు. తర్వాత పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ మాత్రం దూకుడు రాజకీయాలు చేస్తున్నారు. జనసేన పార్టీ ప్రస్తుతం ఏపీలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. పొత్తుల రాజకీయం కూడా ఆ పార్టీ చుట్టే తిరుగుతోంది. ఏపీలో ప్రస్తుతం జనసేన- బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయితే జనసేనతో పొత్తుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కల్యాణ్ కూడా టీడీపీతో పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా 2014 తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉండాలనే సంకేతం ఇస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం జనసేనతోనే తమకు పొత్తు అని.. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని చెబుతోంది.
పొత్తులపై చర్చలు సాగుతున్న సమయంలోనే భీమవరం వచ్చిన ప్రధాని మోడీ పర్యటనలో చిరంజీవి పాల్గొనడం ఆసక్తిగా మారింది. కేంద్ర పర్యాటక- సాంస్కతిక శాఖ నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనాలని చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. చిరంజీవికే కాదు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానాలు వెళ్లాయి. కాని వాళ్లెవరు ప్రధాని పర్యటనలో పాల్గొనలేదు. చిరంజీవి మాత్రమే వచ్చారు. సీఎం జగన్ తో కలిసి వేదిక పంచుకున్నారు. ప్రధాని మోడీకి చిరంజీవిని పరిచయం చేశారు. మోడీతో చిరంజీవి మాట్లాడుతుండగా జగన్ కూడా మాట కలిపారు. సభా వేదికపై కనిపించిన ఈ సీన్ ఇప్పుడు రకరకాల చర్చలకు కారణమైంది.చిరంజీవిని రప్పించడం వెనుక బీజేపీకి భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. చిరంజీవి ద్వారా కాపు సామాజిక వర్గానికి మద్దతు కావాలన్నదే బీజేపీ లక్ష్యమంటున్నారు. పవన్ కల్యాణ్ పార్టీకి మెగా అభిమానులంతా మద్దతు తెలిపారు. కాపు సామాజికవర్గం కూడా జనసేనకు సపోర్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవిని తమవైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీతో కలిసి వెళ్లేలా పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెంచడమే కమలనాధుల ప్లాన్ అంటున్నారు. చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాపులలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని.. పవన్ కూడా కలిస్తే తమకు ప్లస్ అవుతుందన్నది బీజేపీ లెక్కగా తెలుస్తోంది.అదే సమయంలో చంద్రబాబుకు పవన్ దగ్గర కాకుండా చూసేలా కమలనాథులు స్కెచ్ వేశారంటున్నారు.
మరోవైపు భీమవరం సభకు చిరంజీవి రావడానికి సీఎం జగన్ కారణమనే చర్చ కొన్ని వర్గాల నుంచి వస్తోంది. కొంతకాలంగా జగన్ తో సన్నిహితంగా ఉంటున్నారు మెగాస్టార్. సినిమా టికెట్ల అంశంలో తాడేపల్లికి వచ్చిన జగన్ తో చర్చలు జరిపారు. చిరంజీవి రావడం వల్లే జగన్ సర్కార్ ఈ విషయంలో దిగొచ్చిందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ సూచనతోనే చిరంజీవికి అల్లూరి జయంతి వేడుకల ఆహ్వానం వెళ్లిదంటున్నారు. టీడీపీకి దగ్గరవుతున్న పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టేలా జగన్ ఈ ప్లాన్ చేశారని తెలుస్తోంది. కాపులంతా పవన్ వెంట వెళ్లకుండా చిరంజీవితో జగన్ కొత్త ఎత్తు వేశారనే వాదనలు వస్తున్నాయి. తన టార్గెట్ గానే చిరంజీవిని ఆహ్వానించారని గ్రహించడం వల్లే పవన్ కల్యాణ్ భీమవరం సభకు రాలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రధాని రేంద్ర మోడీ, సీఎం జగన్ తో కలిసి భీమవరం సభా వేదికను చిరంజీవి పంచుకోవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ సమీకరణలు మారబోతున్నాయనే ప్రచారం తెరపైకి వస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం చిరంజీవిని పిలవడంలో ఎలాంటి రాజకీయం లేదని.. వివిధ రంగాల్లోని ప్రముఖులను ఆహ్వానించామని చెబుతున్నారు.
Read also: Pawan Kalyan: అక్కడ మోడీ.. ఇక్కడ పవన్! ప్రధాని పర్యటనకు జనసేనాని డుమ్మా అందుకేనా?
Read also: Vishal Accident: మరోసారి షూటింగ్లో గాయపడ్డ హీరో విశాల్.. చిత్ర యూనిట్ షాకింగ్ డెసిషన్!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook