అమరావతి : తెలుగు వారికి బోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక పెన్షన్లను రెట్టింపు చేసి లబ్ధిదారుల ఇంటికి పెద్దకొడుకుగా సంక్రాంతి కానుక ఇచ్చామని అన్నారు. ప్రస్తుతం అన్నిరకాల పెన్షన్స్ కలిపి రాష్ట్రంలో 50,61,906 మందికి సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పిన ఆయన... దివ్యాంగులకు నెలకు రూ.3 వేలు, రెండు చేతులు కోల్పోయిన దివ్యాంగులకు రూ.10 వేలు ఇచ్చి వారి కుటుంబాలను అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అలాంటి దివ్యాంగులు 200-300 మంది ఉంటారని చెప్పిన చంద్రబాబు.. లబ్ధిదారులను గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. నిరుపేదల కళ్లల్లో వెలుగులు చూడటమే తనకు నిజమైన సంక్రాంతి అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైతులకు మేలు.. కనుమరుగవుతున్న కరువు.. 
పట్టిసీమ కింద గడిచిన నాలుగేళ్లలో రూ. 44 వేల కోట్ల విలువైన పంట పండిందని, కృష్ణా జలాలు తీసుకెళ్లి రాయలసీమలోని చెరువులు నింపడం జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు అవసరాల మేరకు సాగు నీరు అందిస్తుండటంతో క్రమక్రమంగా కరవుఛాయలు సైతం తొలగిపోతున్నాయని చెప్పిన చంద్రబాబు... పట్టిసీమ స్ఫూర్తితో పంచనదుల మహా సంగమ పనులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. 


65%కు పైగా పూర్తయిన పోలవరం..
పోలవరం ప్రాజెక్టు పనులు 65%కు పైగా పూర్తయ్యాయి. ఇటీవల చేపట్టిన కాంక్రీటు పనులను అతివేగంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఘనతను సొంతం చేసుకున్నామని చంద్రబాబు వివరించారు.