జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌తో లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారు చర్చించాక బయటకు వచ్చి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"పవన్ కళ్యాణ్‌ను తెరపై హీరోగా చూడడానికి కొన్ని లక్షలమంది డబ్బులిచ్చి టికెట్ కొనుక్కొని మరీ వెళ్తారు. అలాంటి సినీ ఫీల్డ్ నుండి పాలిటిక్స్‌లోకి వచ్చి పవన్ కోరుండి రాజకీయమనే కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఆ కష్టాలు కూడా చిన్న వయసులో తెచ్చుకుంటున్నారు. అంతే గానీ  రిటైర్మెంట్ వయసులో కాదు.. మార్కెట్‌లో డిమాండ్ పడిపోయినప్పుడు కాదు. సమాజం పట్ల ప్రేమ ఉంటేనే.. మంచిని చెప్పాలనే తపన ఉంటేనే ఇలా ఆలోచించడం జరుగుతుంది.


సమాజానికి ఏదో చేయాలన్న ఆకాంక్ష ఉంటేనే ఇలాంటి సాహసం సాధ్యం. అందుకు మనసారా ఆయనను అభినందిస్తున్నాను.  సోదరుడు పవన్ కళ్యాణ్‌తో లోతుగా మనసు విప్పి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు వారికి కావాల్సిన ఫలాలు అందకపోతున్నప్పుడు ఆ మార్పు కోసం ఏం చేయగలం? అనే విషయాన్ని చర్చించడంతో పాటు మన తెలుగు రాష్ట్రాల సమస్యపై కూడా మాట్లాడాం. సాక్షాత్తు నిన్న ప్రధాని మోదీగారే తెలుగు రాష్ట్రాన్ని ఎంత అమానవీయమైన రీతిలో విభజించారో తన ప్రసంగంలో చెప్పారు. ఆ విషయాన్ని పత్రికల్లో చదివాను.


అయితే రాష్ట్ర విభజన విషయంలో పార్లమెంట్‌లో సుదీర్ఘంగా చర్చించి చట్టం చేసిన తర్వాత కూడా విభజన హామీలను ఇప్పటి ప్రభుత్వం అమలు చేయలేదు.  విభజన హామీల అమలు కోసం ఒక వేదికను (ఐక్య కార్యచరణ సమితి) నిర్మించాలన్న పవన్‌ ఆలోచనకు నేను మద్దతిస్తున్నాను" అని తెలిపారు. 


రాష్ట్ర విభజన జరిగాక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెప్పిన హామీలను మోదీ సర్కార్ నెరవేర్చలేదని, ఈ విషయంలో దిశానిర్దేశం చేయాలని లోక్ సత్తా పార్టీ అధినేతను తాను కోరినట్లు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఈ అంశాలపై జేపీ గతంలో చాలా రీసెర్చి చేశారని.. ఆయన సూచనలు ప్రభుత్వానికి చాలా అవసరమని.. త్వరలోనే తామిరువురం మళ్లీ భేటి అవుతామని చెప్పారు.