జనసేన పార్టీ గుర్తును ఆ పార్టీ వ్యవస్థాపకులు కొణిదెల పవన్‌ కల్యాణ్‌ అధికారికంగా ప్రకటించారు. జనసేన పార్టీ గుర్తును పిడికిలిగా పెట్టాలని పార్టీ కార్యవర్గం నిశ్చయించిందని ఆయన  పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు సభలో తెలిపారు. సమాజంలో ఐకమత్యానికి చిహ్నంగా ఈ పిడికిలి గుర్తు ఉంటుందని ఆయన అన్నారు. కులమతాలకతీతంగా అందరూ కలసికట్టుగా ఉండి బలాన్ని చూపించాలంటే.. పిడికిలి చూపించాల్సి ఉంటుందని, అందుకే ఈ గుర్తును ఎంపిక చేశామని పవన్ అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే సభలో ఆయన ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పై సెటైర్లు వేశారు. "స్టాన్ ఫోర్డు యూనివర్సిటీలో లోకేష్ చదువుకున్నారు. అదే యూనివర్సిటీలో చదువుకున్న అమెరికా 35వ అధ్యక్షులు కెనడీ చెప్పిన మాటలను లోకేష్ గ్రహించాలి. దేశం నాకేమిచ్చింది అని కాదు.. దేశానికి నేను ఏమి ఇచ్చాను" అని కెనెడీ చెప్పారు. లోకేష్ మాత్రం దేశంలో ఎంత జుర్రుకున్నామో చూస్తున్నారు. మీరు మీ నాన్నగారిని కాకుండా అబ్రహం లింకన్, కెనడీ, గాంధీజీ, పటేల్, అల్లూరి సీతారామరాజు లాంటి మహాత్ముల్ని ఆదర్శంగా తీసుకోండి. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోండి" అని పవన్ కల్యాణ్ హితవు పలికారు. 


"రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విఫలయమయ్యారు. కనీసం నిడదవోలుకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా సాధించలేకపోయారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుతున్నా.. ఈ బ్రిడ్జి విషయంలో ఎంపీ మురళీ మోహన్ గారు శ్రద్ధ చూపడం లేదు. రైళ్లు ఎప్పుడు వస్తాయో చూసుకొని బయటకు రావాల్సిన పరిస్థితుల్లో నిడదవోలు ప్రజలున్నారు. ఇక ఇక్కడి ఇసుక మాఫియా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నిసార్లని తిడతాం" అని పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై మండి పడ్డారు.