Pawan Kalyan: తన ఒక్కడి రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. పదవులు కోరుకుంటే ఎప్పుడో వచ్చేదని.. కానీ తనకు పదవులు ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అనకాపల్లిలో నిర్వహించిన 'వారాహి విజయభేరి' యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్‌, అసెంబ్లీ అభ్యర్థులు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్‌తో కలిసి ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. 'అనకాపల్లి నుకలమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వ జాతరగా చేసేందుకు కృషి చేస్తాం. ఒకప్పుడు అనకాపల్లిలో బెల్లం గురించి వినిపించేది. ఇప్పుడు అనకాపల్లిలో వైసిపి కోడి గుడ్డు వినిపిస్తుంది' అని పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read; YS Sharmila: ప్రధాని నరేంద్ర మోదీకి మా అన్న జగన్‌ కట్టుబానిస: వైఎస్‌ షర్మిల


 


'అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తొస్తుంది. కానీ ప్రస్తుతం అనకాపల్లి అంటే కోడిగుడ్డు వినిపిస్తోంది. కోడి గుడ్డు పెట్టింది. ఇంకా పొదుగుతూనే ఉంది. వైసీపీ కోడి ఈ జిల్లాకు ఉప ముఖ్యమంత్రి, ఐదు పోర్ట్‌ఫొలియోలకు మంత్రిని, ఒక విప్‌ ఇచ్చింది. కానీ ఒక్క కిలోమీటర్‌ రోడ్డు కూడా వేయలేకపోయింది' అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'యువత, అడపడుచులు, పెద్దలు మాకు ఇస్తున్న మద్దతు చూస్తుంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సాగనంపాలని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో అర్దం అవుతుంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే పొత్తులు పెట్టుకున్నాం' అని పవన్‌ తెలిపారు. దశాబ్ద కాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడిపినట్లు చెప్పారు. 

Also Read: EC Notice: చంద్రబాబుకు ఈసీ భారీ షాక్‌.. 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని నోటీస్‌


ఈ సందర్భంగా సీఎం జగన్‌పై పవన్‌ విమర్శలు చేశారు. 'అమ్మఒడి పథకం పెట్టినపుడు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. రెండో ఏడాదికి వెయ్యి రూపాయలు వేశారు. మూడో ఏడాదికి వచ్చేసరికి ఇంకా కోత లు పెట్టారు. అమ్మఒడి ద్వారా రూ.19,600 కోట్లు ఇచ్చినట్టు ఇచ్చి.. మద్వం ద్వారా లక్ష కోట్లు దోచుకున్నారు' అని పవన్‌ ఆరోపించారు. జగన్‌ ముఖ్యమంత్రి కాదు.. మద్యం వ్యాపారిలా మారారని మండిపడ్డారు.


అధికారంలోకి రాగానే తుంపాల చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక షుగర్ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్‌గా మార్చేశారని విమర్శించారు. అనకాపల్లి బెల్లం మార్కెట్ వ్యవస్థ బలోపేతం చేస్తామని ప్రకటించారు. కోడిగుడ్డు ప్రభుత్వం కావాలా?! అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో బాగు కోసం టీడీపీ, జనసేన, బీజేపీలను గెలిపించాలని పిలుపునిచ్చారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook