జనసేనలోకి సీబీఐ మాజీ జేడీ ? ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించిన పవన్ కల్యాణ్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అని కొందరు చెబుతోంటే... జనసేన పార్టీలో చేరనున్నారని ఇంకొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని వెల్లడించడం ఆసక్తిని రేపిస్తోంది.
''సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరాలని భావిస్తే, ఆయనకు ఆహ్వానం పలకడానికి సిద్ధంగా వున్నాం'' అని అన్నారు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆయనకు రాజకీయ, పరిపాలన అంశాలపై మంచి పట్టు వుందని పవన్ అభిప్రాయపడ్డారు. '' ప్రస్తుతానికి లక్ష్మీనారాయణతో ఎలాంటి రాజకీయపరమైన చర్చలు జరపలేదు. గతంలో ఒకే ఒక్క సందర్భంలో ఆయనను కలిశాను. ఆ తర్వాత ఆయనను మళ్లీ కలవడం కానీ లేదా మాట్లాడడం కానీ జరగలేదు'' అని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. జేడీ రాజకీయాల్లోకి వస్తున్నారని వినిపిస్తున్న వార్తలను తాను కూడా గమనిస్తున్నానన్న పవన్.. ఇటీవల గుంటూరులో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభకు ముందు లక్ష్మీనారాయణ తనకు 'ఆల్ ది బెస్ట్' అని ఓ మెసేజ్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. లక్ష్మీ నారాయణ జనసేన పార్టీలో చేరబోతున్నారని వెలువడుతున్న వార్తలపై స్పందిస్తూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటివరకు మహారాష్ట్ర అడిషనల్ డీజీగా కొనసాగిన లక్ష్మీనారాయణ.. ఇటీవలే తన పోస్టుకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వాల్యుంటరీ రిటైర్‌మెంట్‌కి దరఖాస్తు చేసుకున్న ఈ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ త్వరలో రాజకీయాల్లో చేరనున్నట్టు ఓ టాక్ వినిపిస్తోంది. ఆయన బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అని కొందరు చెబుతోంటే... జనసేన పార్టీలో చేరనున్నారని ఇంకొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇవన్నీ ఇలా వుంటే, ఆయనే సొంత పార్టీ పెట్టబోతున్నారనే వాళ్లు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని వెల్లడించడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. వీటన్నింటికి అసలు సమాధానం తెలియాలంటే, లక్ష్మీనారాయణ స్వయంగా స్పందించే వరకు వేచిచూడాల్సిందే మరి!