సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కి వీరాభిమాని అయిన కొమురవెల్లి అనిల్ కుమార్ విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నారు. వృత్తిరీత్యా విజయవాడలో ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న అనిల్ కుమార్‌కి పవన్ కల్యాణ్ అంటే ఎంతో అభిమానం. జనసేన పార్టీ కార్యక్రమాల్లోనూ అనిల్ కుమార్ చురుకుగా పనిచేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మహత్యకు పాల్పడిన అనిల్ కుమార్ అంతకన్నా ముందుగా పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి ఓ లేఖ రాశాడు. బతికున్నన్ని రోజులు మిమ్మల్ని చూడలేకపోయాను.. నన్ను చూసి నా అంత్యక్రియల్లో పాల్గొనెందుకైనా మీరు రావాలన్నా అని అనిల్ కుమార్ తన లేఖలో పవన్‌కి విజ్ఞప్తి చేశాడు. అదే తన చివరి కోరికగా అనిల్ కుమార్ తన లేఖలో పేర్కొన్నాడు. 


ఇటీవల పవన్ కల్యాణ్ విజయవాడలో పాదయాత్ర నిర్వహించిన సమయంలోనూ అనిల్ కుమార్ అందులో చురుకుగా పాల్గొన్నట్టు అతడి సన్నిహిత మిత్రులు చెబుతున్నారు. అభిమాని అఘాయిత్యంపై పవన్ కల్యాణ్ ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి!