పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 16వ రోజు మంగళవారం నాడు కూడా పెరిగాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఐదు సంవత్సరాల గరిష్ఠానికి చేరుకున్నాయి. కర్ణాటకలో ఎన్నికల కారణంగా 19 రోజుల పాటు పెట్రోల్‌ ధరలను రోజువారీ పెంచలేదు. ఫలితాలు వెల్లడయ్యే రోజు నుంచి వరుసగా రోజు ధరలను పెంచుతున్నారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామన్యుడి నడ్డి విరుస్తున్నాయి. దీని ప్రభావం రవాణా మీద పడటంతో నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, డాలర్‌ మారకంతో రూపాయి బలహీనపడటం, పన్నులకు సంబంధించిన అంశాలు అనే మూడు కారణాలతో చమురు ధరలు పెరిగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹78.43, డీజిల్ ధర ₹69.31గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ₹86.24, డీజిల్ ధర ₹73.79గా ఉంది. మెట్రో నగరాల్లో చూస్తే అత్యంత తక్కువ దేశ రాజధాని ఢిల్లీలోనే లభిస్తుంది. కొన్ని రాష్ట్ర రాజధానుల్లో స్థానిక పన్నులు లేదా వ్యాట్‌ ధరల ఆధారంగా ధరలు ఉంటాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ₹83.08, డీజిల్ ధర ₹75.34గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹84.278, డీజిల్ ధర ₹76.245గా ఉంది.


త్వరలో శాశ్వత పరిష్కారం: ధర్మేంద్ర ప్రధాన్


రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలు ధరలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక శాశ్వత పరిష్కారం కనుగొంటోందని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం చెప్పారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలు పెరిగాయని అన్నారు.