SAJJALA ON NARAYANA : నారాయణ అరెస్ట్ వ్యవహారంపై మరోసారి ఘాటుగా స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు సజ్జల. నారాయణ విద్యా సంస్థల్లో జరిగింది ప్రశ్నపత్రాల లీక్‌ కాదని.. పరీక్ష ప్రారంభం కాగానే, పేపర్‌ను ఫోటో తీసి, కొందరి వద్దకు పంపి, సమాధానాలు రాయించి, వాటిని విద్యార్థులకు చూపడం ద్వారా నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే లక్ష్యంతో, మొత్తం వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ ఈ వ్యవహారం జరిపారని సజ్జల ఆరోపించారు. ఆ కేసులోనే అన్ని ఆధారాలతో నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను అరెస్టు చేసినట్లు తెలిపారు సజ్జల.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ టీడీపీ విమర్శలు చేస్తోందని.. అయితే దీనిపై సీరియస్‌గా స్పందించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, తప్పు ఎవరు చేసినా వదిలి పెట్టొద్దని స్పష్టం చేశారని... ఆ ప్రక్రియలోనే నారాయణను అరెస్టు చేశారని మరోసారి స్పష్టం చేశారు.


నిజానికి గతంలో కూడా నారాయణ విద్యా సంస్థల్లో ప్రశ్నపత్రాలు బయటకు తీసుకురావడం, తద్వారా మంచి ఫలితాలు వచ్చేలా చూడడం కొనసాగిందన్నారు సజ్జల. ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు అంతా సాఫీగానే జరిగిందన్నారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక, తొలి రెండేళ్లు కొవిడ్‌ వల్ల పరీక్షలు జరగలేదని.. ఈసారి పరీక్షలు నిర్వహించడంతో, ఆ విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమ వ్యవహారం బయట పడిందని సజ్జల పేర్కొన్నారు. అత్యంత హేయమైన ఈ నేరం కోసం మాఫియా ముఠా మాదిరిగా వ్యవహరించడం ఒక ఆనవాయితీగా మారిందన్నారు.


నిజానికి విద్యార్థుల భవిష్యత్తును కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ చర్యలను అభినందిస్తారని సజ్జల స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తును దెబ్బ తీసే విధంగా ఒక చెదపురుగులా మారి, వ్యవస్థను కూడా నాశనం చేస్తున్న వ్యవహారాన్ని.. ఒకేసారి కఠినంగా వ్యవహరించి ఉక్కుపాదం మోపినందుకు అభినందించాల్సింది పోయి.. రాజకీయం చేయటం సిగ్గుచేటని సజ్జల మండిపడ్డారు.


నారాయణను అరెస్టు చేస్తే.. టీడీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన యాగి సిగ్గుచేటన్నారు సజ్జల. నారాయణ సంస్థల్లో జరుగుతోంది తప్పని ఒప్పుకోవాల్సింది పోయి విమర్శించటమేంటని ప్రశ్నించారు. వ్యవస్థలో చీడపురుగుల్లా మారి విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీస్తున్న వారిపై చర్య తీసుకోవాలని కోరాల్సిందిపోయి అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రశ్నపత్రాలు బయటకు వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకున్న నిందితులు ఇచ్చిన నేర అంగీకార స్టేట్‌మెంట్‌ ప్రకారమే, నారాయణను అదుపులోకి తీసుకున్నారని సజ్జల స్పష్టంచేశారు. అయినా చంద్రబాబు ఇది రాజకీయ కక్ష అని ఆరోపించి కేంద్ర హోం మంత్రికి లేఖ రాయటం ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. 


అసలు నారాయణను అరెస్టు చేస్తే చంద్రబాబు ఎందుకు అంతగా భయపడుతున్నారు? ఆ విద్యా సంస్థల వెనక చంద్రబాబు ఉన్నారా? మాల్‌ ప్రాక్టీస్‌ తప్పు కాదని టీడీపీ చెప్పగలదా? ఇతర విద్యార్థులకు నష్టం జరుగుతున్నా నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ సమర్థిస్తుందా?. అని ప్రశ్నించారు. తమకు నారాయణే అన్నీ డైరెక్ట్‌ చేస్తారని, ఆ సంస్థల సిబ్బంది స్వయంగా నేర అంగీకార స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాతే, నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సజ్జల అన్నారు.


అంత అర్ధరాత్రి మెజిస్ట్రేట్‌ ఇంటి వద్ద వాదనలు ఏంటి? అది అంత అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందా?. నారాయణ 2014లోనే ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసి ఉండొచ్చు. కానీ ఆయనే అన్నీ చూసుకుంటున్నాడు కదా? పైగా మాఫియాలా పని చేస్తున్న ఈ మాల్‌ ప్రాక్టీస్‌ పూర్తిగా నారాయణ కనుసన్నల్లోనే జరుగుతోందని సిబ్బంది స్వయంగా చెప్పినా బెయిల్‌ రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు సజ్జల. సాంకేతికపరంగా నారాయణ ఛైర్మన్‌ కాకపోవచ్చని.. ఆయన అల్లుడు ఇప్పుడు ఆ సంస్థలు చూస్తున్నట్లయితే, రేపు ఆయనను అదుపులోకి తీసుకున్నా, టీడీపీ ఇలాగే స్పందిస్తుందా? అని ప్రశ్నించారు సజ్జల. వ్యవస్థను నాశనం చేస్తున్న మాఫియాను కచ్చితంగా అదుపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు సజ్జల. ఈ కేసుపై తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎక్కడా వెనక్కు తగ్గదని స్పష్టంచేశారు.


చంద్రబాబు ప్రతిదీ రాజకీయ కక్ష అంటున్నారని.. నిజంగా అదే నిజమైతే అధికారం చేపట్టగానే అది జరిగేదని సజ్జల పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అలా వ్యవహరించడం లేదన్నారు. మాఫియా వ్యవహారం బయటపడిన తర్వాత, పక్కా ఆధారాలతోనే నారాయణను పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఇంకా ఎంత కాలం ఇలా రాజకీయ కక్షలంటూ విమర్శలు చేస్తూ, ఆ ముసుగులో తెలుగుదేశం, చంద్రబాబు ఇలాంటి నేరాలను సమర్థిస్తారని ప్రశ్నించారు సజ్జల.


Also Read - Bandi Sanjay on KCR : కేసీఆర్‌కు బండి సవాల్


Also read - SVP Special Shows: 'సర్కారు వారి పాట' స్పెషల్ షోలు.. ఆ నాలుగు థియేటర్లలో ఉదయం 4 గంటలకే బొమ్మ పడుతుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook