నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్‌పై బుధవారం రాత్రి సుమారు 50 మంది స్థానికులు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్థానికులు ఏకంగా పోలీసు స్టేషన్‌లోకే దూసుకెళ్లి మరీ ఎస్సై లక్ష్మణ రావు సహా ముగ్గురు కానిస్టేబుళ్లపై దాడిచేసిన వైనం పోలీస్ ఉన్నతాధికారులను సైతం ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్సై, కానిస్టేబుళ్లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం రాపూరులోని హరిజనవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ అనే ముగ్గురు అదే ప్రాంతానికి చెందిన జోసఫ్‌ అనే స్థానికుడి వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, వారు ఆ అప్పు తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మణ రావు.. పిచ్చయ్యతోపాటు లక్ష్మమ్మ, కనకమ్మలను విచారించేందుకు స్టేషన్‌కు పిలిపించినట్టు సమాచారం. అయితే, విచారణలో పోలీసులు ఆ ముగ్గురిపై చేయిచేసుకున్నారని సమాచారం అందుకున్న స్థానికులు భారీ సంఖ్యలో స్టేషన్‌లోకి చొచ్చుకువెళ్లారు. పోలీసు సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా ఎస్సై లక్ష్మణ రావుతోపాటు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డారు.


 



పోలీసులపై దాడి ఘటనపై స్పందించిన స్థానిక డీఎస్పీ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే, అదే సమయంలో స్థానికులు అంత ఆగ్రహావేశాలకు గురిచేసిన పరిస్థితులు ఏంటనేదానిపై సైతం విచారణ జరిపించనున్నట్టు డీఎస్పీ రాంబాబు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.