Chinthamaneni Prabhakar: కోడి పందేల కేసుపై చింతమనేని రియాక్షన్.. వైసీపీకి గట్టి వార్నింగ్..
Chinthamaneni Prabhakar Reaction over Cockfight Case : కోడి పందేలు నిర్వహిస్తూ పోలీసులు రాగానే పారిపోయినట్లు తనపై వచ్చిన ఆరోపణలను చింతమనేని ఖండించారు.
Chinthamaneni Prabhakar Reaction over Cockfight Case : కోడి పందేల కేసులో తన పేరు వినిపించడాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఖండించారు. హైదరాబాద్ శివారులో కోడి పందేల స్థావరంపై పోలీసులు జరిపిన దాడుల్లో తప్పించుకుని పారిపోయాడంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇంత రాక్షస రాజకీయం అవసరమా అంటూ పరోక్షంగా వైసీపీపై ఫైర్ అయ్యారు. ఈ మేరకు చింతమనేని ఫేస్‌బుక్ ద్వారా కోడి పందేల ఘటనపై స్పందించారు.
'కోడి పందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్లుగా చూపడం మీ జెండా అజెండా. ఇంత రాక్షస రాజకీయం అవసరమా. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోండి. ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారాన్ని ఇకనైనా ఆపండి. ఈ నీచపు ప్రచారంతోనే కుప్పకూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారు. తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి నాడు అధికారంలోకి వచ్చారు. ఆ మేడ కూలిపోయే సమయం ఆసన్నమైంది. మీ అసత్యాలు ప్రజలు కూకటివేళ్లతో ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమైంది. ఆరోజు కోసమే తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మీ రాజకీయ వికటాట్టహాసానికి ముగింపు త్వరలోనే. మీ చింతమనేని ప్రభాకర్.' అంటూ పరోక్షంగా వైసీపీ ప్రభుత్వాన్నిహెచ్చరించారు చింతమనేని.
హైదరాబాద్ శివారు పటాన్‌చెరులోని చినకంజర్లలో చింతమనేని ప్రభాకర్ మరికొందరితో కలిసి కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బుధవారం (జూన్ 6) రాత్రి చినకంజర్లలో ఓ కోడి పందేల స్థావరంపై పటాన్‌చెరు డీఎస్పీ భీం రెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరిపి 21 మందిని అరెస్ట్ చేశారు. దాడుల సమయంలో అక్కడే ఉన్న చింతమనేని పోలీసులను చూసి పరారైనట్లు ప్రచారం జరుగుతోంది. చింతమనేని కోసం పోలీసులు కూడా ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, చింతమనేని మాత్రం కోడి పందేలతో తనకెలాంటి సంబంధం లేదని.. ఇదంతా ప్రత్యర్థుల నీచపు ప్రచారమేనని స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook