Cockfight in Patancheru: ఏపీలోనే కాదు తెలంగాణలోనూ పలుచోట్ల కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొన్ని నెలలుగా కోడి పందేలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారు పటాన్ చెరు సమీపంలోని చినకంజర్లలో కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 21 మంది పట్టుబడ్డారు. ఏపీకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల రాకతో అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం చింతమేనని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చినకంజర్లలో గుట్టుచప్పుడు కాకుండా కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బుధవారం (జూలై 6) రాత్రి చినకంజర్లలోని కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. చింతమనేని ప్రభాకర్, అక్కినేని సతీష్, కృష్ణంరాజు, శ్రీను అనే వ్యక్తులు ఒక గ్రూపుగా ఏర్పడి కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దాడుల సందర్భంగా 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.13 లక్షలు నగదు, 26 వాహనాలు, 27 సెల్‌ఫోన్లు, 30 కోడి కత్తులు, 31 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు దాడులు చేసిన సమయంలో కోడి పందేల స్థావరంలో మొత్తం 70 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. 21 మంది పట్టుబడగా మిగతావారు పరారైనట్లు సమాచారం. పరారైనవారిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్నవారిని పట్టుకునేందుకు మూడు స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
టీడీపీ నేత చింతమనేని మొదటి నుంచి వివాదాలతోనే సహవాసం చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసులో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ దాడి ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. ఆ తర్వాత ఓ సందర్భంలో ఎస్సీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా కోడి పందేల స్థావరం నుంచి చింతమనేని ఎస్కేప్ అవడం హాట్ టాపిక్‌గా మారింది.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook