తెలంగాణ ఏర్పాటు చేయాలని తన సమ్మతిని తెలియజేస్తూ.. ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇస్తూ నారా చంద్రబాబు నాయుడు లేఖను రాయబట్టే తెలంగాణ సిద్ధించిందని తెలుగుదేశం నేత, ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు.  టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాలన్నీ దుష్ప్రచారాలే అని.. వారి పరిపాలనతో తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం వాస్తవమేనని నామా అన్నారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎంతో అభివృద్ధి చేసిందని.. ఇప్పటికే ఆ పార్టీ క్యాడర్ తెలంగాణలో బలంగా ఉందని నామా అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆనాడు యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకోవడానికి కారణం చంద్రబాబు రాసిన లేఖ అని.. ఆ విషయం తెలంగాణ ప్రజలకు కూడా తెలుసని నామా అన్నారు. ఈ సారి మహాకూటమి (ప్రజాకూటమి) కచ్చితంగా తెలంగాణలో గెలవడం ఖాయమని.. టీఆర్ఎస్ చేస్తున్న మోసాలను, వంచనను తెలంగాణ ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారని నామా నాగేశ్వరరావు తెలిపారు. ఈ సారి తెలుగుదేశం పార్టీ తరఫున మహాకూటమి ఒప్పందంలో భాగంగా నామా నాగేశ్వరరావు ఖమ్మం నుండి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.


నామా నాగేశ్వరరావు తొలిసారిగా లోక్ సభకు 2004లో తెలుగుదేశం పార్టీ తరపున, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరి పై పోటీచేసి లక్ష ఓట్ల తేడాతో ఓడిపొయారు. తిరిగి అదే అభ్యర్థి మీద 2009లో సుమారు 125000 ఓట్లతో  గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం నియోజకవర్గం నుండి 11,000 ఓట్ల తేడాతో వై.సి.పి. అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో నామా ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో మరియు పార్లమెంటరీ  అధ్యక్షులుగా నామా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.