తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణ కోల్ హీట్ వేవ్ జోన్ పరిధిలో ఉండటం అధిక ఉష్ణోగ్రతలకు ఓ కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాజస్థాన్ నుండి వీస్తోన్న వేడిగాలుల ప్రభావంతో తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న మూడు రోజుల పాటు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని, వాయువ్య దిశ నుంచి వచ్చే గాలుల ప్రభావంతో మే నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు ఘననీయంగా పెరుగుతాయని.. ఫలితంగా జూన్ మొదటి వారం వరకు ఎండల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు.
తెలంగాణ కోర్ హీట్ వేవ్ జోన్ పరిధిలో ఉండటం అధిక ఉష్ణోగ్రతలకు ఓ కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజస్థాన్ నుంచి ప్రారంభమయ్యే ఈ జోన్ పరిధిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలున్నాయి. కోర్ హీట్ వేవ్ జోన్ పరిధిలోని ప్రాంతాల్లో సూర్యకిరణాలు నిటారుగా పడటం వల్ల ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు.
ఇదిలావుంటే, మరోవైపు ఏపీలోనూ అత్యధిక స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సాధారణ ప్రజానికానికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. నెల్లూరులో నిన్న మంగళవారం గరిష్టంగా 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే.