ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ చీఫ్ అమిత్ షా బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ లేఖ రాశారు.
ఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ లేఖ రాశారు. ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలగడం ఏకపక్ష నిర్ణయంగా భావిస్తున్నా. మీరు తీసుకున్న నిర్ణయం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. రాజకీయ కారణాల వల్లే బయటికి వెళ్ళారని భావిస్తున్నా' అని అమిత్ షా ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఏపీకి సంబంధించిన ఏ విషయంలోనూ తమ ప్రభుత్వం వెనుకడుగు వేయలేదని, ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, అన్ని రకాలుగా సాయం చేసిందని, చేస్తుందని లేఖలో వివరించారు.
ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులు, తదితర వివరాలను మొత్తం 9 పేజీల్లో ఓ లేఖ రూపంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సాయం చేసిందని అన్నారు. ఏపీకి చట్టంలో పేర్కొన్న హామీలన్నీ నెరవేర్చుతున్నామని, 3 ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చామన్నారు. కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు కేటాయించామని, ఏపీకి కేంద్ర విద్యాసంస్థలు, ఎయిమ్స్ ఇచ్చామని అన్నారు. అంతేగాక, మెట్రో రైల్ నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలిపిందన్న విషయాన్ని కూడా అమిత్ షా లేఖలో తెలిపారు.