జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రహస్యాలు భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఉన్నాయని.. అందుకే పవన్ కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తెలిపారు. పవన్ ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ దాడులు జరుగుతున్నా స్పందించకపోవడానికి కారణం ఆ రహస్యాలేనని రామయ్య అన్నారు. అయితే ఆ రహస్యాలేమిటో ఆయన బయటపెట్టలేదు. అలాగే రామయ్య నాదెండ్ల మనోహర్ పై కూడా కామెంట్స్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనోహర్ రూపంలో పవన్‌కు కొత్త ట్యూటర్ దొరికారని ఆయన ఎద్దేవా చేశారు. అదేవిధంగా బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై కూడా రామయ్య ధ్వజమెత్తారు. ఆయనను గురివింద గింజతో పోల్చారు. బీజేపీకి, వైఎస్సార్సీపీకి కన్నా లక్ష్మీనారాయణ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారన్న విషయం అందరికీ తెలుసని ఆయన అన్నారు. అన్ని పార్టీలపైనా విమర్శలు చేస్తున్న కన్నా.. జగన్ పై, ఆయనపై ఉన్న కేసులపై విమర్శలు చేయకపోవడానికి కారణం ఏమిటని ఆయన తెలిపారు. కన్నా కూడా తన ఆస్తుల వివరాలు ప్రకటిస్తే బాగుంటుందని సూచించారు.


అదేవిధంగా బీజేపీ జాతీయ నేత అమిత్ షాపై కూడా వర్ల రామయ్య విమర్శల పర్వం కొనసాగింది. అమిత్ షా కుమారుడి ఆస్తులు 16వేల రెట్లు పెరిగాయని.. అయినా ఆయనపై ఐటీ దాడులు జరగకపోవడానికి కారణాలు ఏమిటని ఆయన అన్నారు. అన్ని పార్టీల నేతల ఇండ్లపైనా ఐటి దాడులు చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. బీజేపీ, వైఎస్సార్సీపీ నాయకుల ఇండ్లపై ఎందుకు దాడులు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇది బీజేపీ చేస్తున్న కక్ష సాధింపు చర్య అని.. ఇలాంటి కుటిల రాజకీయాలను తాము సహించమని రామయ్య అభిప్రాయపడ్డారు.