ఎప్పటినుంచో తమకు అందాల్సి ఉన్న పదోన్నతితోపాటు న్యాయపరమైన సమస్యల పరిష్కారానికై సమ్మె బాట పట్టబోతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీఆర్వోల సంఘం పిలుపునిచ్చింది. ఈమేరకు ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోలు నిరసనలు చేపట్టనున్నట్టు ఏపీ విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అమలాపురం డివిజన్‌శాఖ ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్డీవో బి.వెంకటరమణకు వినతిపత్రం అందజేసిన అనంతరం సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి 18వ తేదీవరకు కాకినాడ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టిన అనంతరం 19, 20 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసనలు తెలుపుతూ విధులకు హాజరై పెన్‌డౌన్‌ చేయాలని సంఘం నిర్ణయించినట్టు తెలిపారు. 


21నుంచి 24వ తేదీ వరకు విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద రిలే నిరాహార దీక్ష, 25న చలో సీసీఎల్‌ఏ కార్యాలయ ముట్టడించనున్నట్టు ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర వీఆర్వోల సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఏపీ రాష్ట్ర వీఆర్వోల సంఘం తలపెట్టిన ఈ ఆందోళనలకు సీపీఐ(ఎం) నేత బీవీ రాఘవులు తమ మద్దతు ప్రకటించారు.