ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుందా లేదా ? అని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఎంత దూరంలో ఉందో.. కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే దూరంలో ఉంటుందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ అనేది సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే నడుచుకుంటుందని.. పార్టీలో ఎవరైనా సరే ఆయన నిర్ణయానికే కట్టుబడతారని చినరాజప్ప అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జగన్ మోహన్ రెడ్డి లాంటివారు అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా సరే.. తెలుగుదేశాన్ని ఎదుర్కోవడం అంత తేలికకాదన్నారు. చంద్రబాబు ప్రజలకోసం ఎంతో చేస్తున్నారని.. అవన్నీ ప్రజలకు తెలుసని చినరాజప్ప అభిప్రాయపడ్డారు. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటోందని.. వరి హెక్టారుకి రూ.25 వేలు ఇవ్వడానికి తమ ప్రభుత్వం ముందుకొచ్చిందని చినరాజప్ప తెలిపారు. తమ ప్రభుత్వం ఇంకా ఎన్నో విధాలుగా అభివృద్ధి దిశగా వెళ్లడానికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. 


1986లో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన చినరాజప్ప.. . 1992లో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఎన్నికై 2014 వరకూ సుదీర్ఘ కాలం ఆ పదవిలో కొనసాగారు.  2007 నుండి 2013 వరకూ ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికలలో పెద్దాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ ఆధిక్యంతో గెలుపొందిన చినరాజప్పకి డిప్యూటీ సీఎం పదవిని చంద్రబాబు నాయుడు అందించారు. 1995లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ ఛైర్మన్‌గా, 1998లో సివిల్ సప్లైస్ ఛైర్మన్ గా, 2001లో కెనరా బ్యాంక్ డైరెక్టర్‌గా కూడా వివిధ పదవులను చినరాజప్ప అధిరోహించారు.