మంత్రివర్గంలోకి మరో యువకుడు ; కిడారి తనయుడికి ఛాన్స్ ?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి ఏజెన్సీ గిరిజనుల నుంచి సానుకూల ఫలితం సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 'కిడారి సర్వేశ్వరరావు హత్య'ను సానుభూతి అస్త్రంగా ఉపయోగించనుందని టాక్. ఈ క్రమంలో ఆయన తనయుడు కిడారి శ్రావణ్‌ను మంత్రి పదవి దక్కవచ్చని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిడారి తయనుడికి అవకాశం కల్పించడం మంచిదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్.
వచ్చే నెలలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది.ఈ విస్తరణలో ఒక మంత్రి పదవి మైనార్టీ వర్గానికి..మరోకటి గిరిజనవర్గానికి చెందిన వారికి ఇవ్వాలని భావిస్తున్నారట. గిరిజన కోటలో కిడారి సర్వేశ్వరరావు పెద్దకుమారుడు కిడారి శ్రావణ్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. యువకుడైన కిడారి శ్రావణ్ ఐఐటీ పట్టభద్రుడు.. పైగా అతను ఎమ్మెల్యే హోదాలో ఉండి హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు తనయుడు. ఈ అర్హతలు ఆధారంగా కిడారి శ్రావణ్ కు మంత్రి పదవి వరించనుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మరోవైపు కనీసం ఎమ్మెల్యే కానీ కిడారి శ్రవణ్ కు మంత్రి పదవి ఎలా ఇస్తారని మరికొందరు పైఅభిప్రాయాలను కొట్టి పారేస్తున్నారు.
గతంలో భూమా నాగిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించగా.. ఆయన ఆకస్మికంగా మరణించారు. దీంతో నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియకు అవకాశం కల్పించారు. కిడారి శ్రవణ్ విషయంలో కూడా ఇలాగే జరిగే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో కిడారి శ్రావణ్‌కు అవకాశం కల్పిస్తారా లేదా అనే విషయంపై ఉత్కంఠత నెలకొంది. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ.. పార్టీ కార్యాలయం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.