జగన్ ప్రజా సంకల్పానికి 200 రోజులు
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200వ రోజు మైలురాయి చేరుకుంది.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర బుధవారం 200వ రోజు మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా జననేత సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ప్రజాసంకల్ప యాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్ ట్విట్టర్‌లో స్పందించారు. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెచ్చి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే నా సంకల్పమని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పాదయాత్ర తొలి రోజు నుంచే ప్రజల ముఖాల్లో రాబోయే రేపటి ఆశలు చూశానన్నారు. భవిష్యత్ బాగుంటుందని ప్రజల మొహాల్లో కనిపిస్తోందన్నారు. త్వరలో రాజన్న రాజ్యం రాబోతోందని అన్నారు. మొదటి రోజు నుంచి 200వ రోజు వరకు తనను ఆశీర్వదించిన ప్రజలందరికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
'ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేను. నాన్న ఆశీస్సులు, ప్రజల చల్లని దీవెనలే నన్ను ఇంత దూరం నడిపించాయి.. నడిపిస్తున్నాయి. రాష్ట్రానికి ఒక గొప్ప సుపరిపాలన అందించే దిశగా కదులుతున్న ఈ ప్రజాసంకల్ప యాత్ర.. 200 రోజులు పూర్తి చేసుకోవడం ఆనందాన్నిస్తోంది' అని ఫేస్‌బుక్‌లో జగన్ పోస్ట్ చేశారు.
'జగన్ సంకల్పం నిజంగా మెచ్చుకోదగ్గదే. తన తండ్రి అనుసరించి బాటనే జగన్ ఎంచుకున్నారు. ప్రజల్లోకి వెళ్ళటం అనే పంథాని ముందుగా రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టారు. దాన్ని ఆయన వారసులిద్దరూ (జగన్, షర్మిల) అనుసరించారు. ప్రజాసంకల్ప యాత్ర ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ... ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా, ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్నారు' అని వైసీపీ నేతలు, అభిమానులు అంటున్నారు. 200 రోజులను పూర్తి చేసుకున్న ప్రజాసంకల్ప యాత్ర ఆనాడు రాజశేఖర్ రెడ్డి చేసిన మహా ప్రస్థానాన్ని మరోమారు గుర్తు చేసిందని పార్టీ నేతలు తెలిపారు.
ప్రజా సంకల్ప యాత్ర సాగిన తీరు..
గత ఏడాది నవంబర్ 6న జగన్ వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి తన పాదయాత్ర ప్రారంభించారు. అడుగులో అడుగేస్తూ అశేష జనవాహిని మద్దతుతో నేటికి 200 రోజులు పూర్తి చేసుకున్నారు జగన్.. 10 జిల్లాలు, 1243 గ్రామాలను, 158 మండలాలను, 92 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేస్తూ 86 జనసభల్లో ప్రసంగించారు. పాదయాత్రలో దారి పొడవునా జనం ఆయనకు నీరాజనం పలికారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ జగన్ పాదయాత్ర సాగుతోంది.
ఏ సభ పెట్టినా జనం.. జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. కానీ ఈ వచ్చిన జనమంతా జగన్ ఏ విధంగా ఓట్ల రూపంలో మలచుకుంటాడన్నదే ప్రశ్న. ఒక సీనియర్ నాయకుడు అన్నట్లు జగన్‌కి ప్రజల మద్దతు ఉంది కానీ ఎన్నికల మేనేజ్‌మెంట్ టీం లేదన్నట్లు ఈ ప్రజాభిమానాన్ని ఓట్ల రూపంలో వైసీపీ ఎలా మలచుకోగలదో రానున్న ఎన్నికల్లో చూడాలి మరి.