శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిన్న మరో మైలు రాయిని అధిగమించింది. 337వ రోజు యాత్రలో భాగంగా శనివారం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని బారువ జంక్షన్‌ వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 3,600 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ ప్రజా సంకల్ప యాత్ర ఇచ్ఛాపురం వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీన ప్రజా సంకల్పయాత్ర ముగియనున్న నేపథ్యంలో పాద యాత్రలో భాగంగా చేపట్టనున్న చివరి సభ కోసం ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 


338వ రోజు పాదయాత్రలో భాగంగా నేటి ఆదివారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట మండలం లక్కవరం నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ పాదయాత్ర పలాసపురం, జింకిభద్ర క్రాస్‌, సోంపేట, ఇసకపాలెం క్రాస్‌ మీదుగా కొనసాగుతోంది. నేటి సాయంత్రానికి మండపల్లి క్రాస్‌ మీదుగా తలతాంపారి చేరుకున్న అనంతరం అక్కడ పార్టీ కార్యకర్తలు, మద్దుతుదారులను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు.