ఆఖరికి మరుగుదొడ్ల మంజూరులోనూ అవినీతే: వైఎస్ జగన్
ఆఖరికి మరుగుదొడ్ల మంజూరులోనూ అవినీతే: వైఎస్ జగన్
కాకినాడ: ఏపీలో చంద్రబాబు నాయుడు పరిపాలన పూర్తిగా అవినీతిమయమైందని చెబుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. కాకినాడ వేదికగా నేడు జరిగిన ఎన్నికల సమర శంకారావం సభకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. మట్టి, ఇసక, మద్యం, బొగ్గు, కాంట్రాక్టులు, గుడి భూములు, దళితుల భూములు ఇలా దేనిని వదలకుండా చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రేషన్ కార్డు, పెన్షన్, ఆఖరికి ఇంటి మరుగుదొడ్ల మంజూరులోనూ అవినీతి చోటుచేసుకుంటోంది అని జగన్ ఆరోపించారు. మనం ఈ 9 ఏళ్లపాటు ప్రతిపక్షంలో వుండగా అధికారంలో వున్న వాళ్లు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, జనం ఎంత నష్టపోయారో తనకు తెలుసు అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ 9 ఏళ్లలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి లాఠీ దెబ్బలు తిన్నవాళ్లూ వున్నారు. ఆస్తులు పోగొట్టుకున్న వాళ్లూ వున్నారు. మీకు తగిలిన గాయాలన్నీ నా గుండెకూ తగిలాయ్. అందుకే వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే మీ కుటుంబసభ్యుడిలా మీలో ఒకరిలా వుంటూ మీ బాగోగులు చూసుకుంటాను అని హామీ ఇస్తున్నాను అని జగన్ ప్రకటించారు. అంతేకాదు.. మీ ఆశీర్వాదంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే మీమీద పెట్టిన దొంగ కేసులు, అక్రమ కేస్తులు అన్ని ఎత్తివేయిస్తానని జగన్ ప్రకటించారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకొస్తే, కులం, మతం, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం అని కాకినాడ సభా వేదికపైనుంచి జగన్ ప్రకటించారు. మార్పు కోరుకుని, విలువలకు, విశ్వసనీయతకు ఓటేయాల్సిందిగా ఈ సందర్భంగా జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు సహకరించిన చంద్రబాబు ఆఖరికి ప్రత్యేక హోదాను కూడా తాకట్టుపెట్టారు అని ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం ఎంత మేరకు అభివృద్ధి సాధించిందో ఒకసారి ఓటర్లు అందరూ ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. తెలుగు దేశం పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది, ఎన్నికల తర్వాత ఏం చేసింది అనే అంశంపై గ్రామాల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ ఓటర్లకు సూచించారు.