JanaSena Party: సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీకి కొత్త జోష్‌ వస్తోంది. అధికారంలోకి వచ్చి వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా జనసేనలోకి సరికొత్త ఉత్సాహం వస్తోంది. ఇన్నాళ్లు చేరికలు లేకపోగా తాజాగా ఊహించని రీతిలో అధికార పార్టీలోకి రాబోతున్నాయి. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, సామినేని ఉదయభాను చేరిక లాంఛనం కాగా అదే బాటలో మరికొందరు ఉన్నట్లు సమాచారం. ఈ చేరికలతో గ్లాస్‌ పార్టీ కళకళలాడుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో పార్టీ బలోపేతం కానుండడం గమనార్హం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Donation: ఏపీకి ఊహించని భారీ విరాళం.. ఏకంగా రూ.25 కోట్లు ఇచ్చిందెవరో తెలుసా?


ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో పట్టుమని పది మంది చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ లేరు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌, నాగబాబు తదితరులు మినహా పెద్ద లీడర్లు కనిపించలేదు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తుకు వెళ్లి అనూహ్యంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించి 100 శాతం సక్సెస్‌ రేట్‌ నమోదు చేసింది. అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రితో సహా కొన్ని పదవులు పొందిన ఈ పార్టీ ఇక రాజకీయంగా బలోపేతంపై దృష్టి సారించింది. ఈక్రమంలోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది.

Also Read: Chandrababu: సిక్కోలు గడ్డపై నుంచి చంద్రబాబు 'ఇది మంచి ప్రభుత్వం' శ్రీకారం


వైఎస్సార్‌సీపీ విలవిల
జనసేన గాలానికి వైఎస్సార్‌సీపీ చిక్కి విలవిలలాడుతోంది. దసరాలోపు భారీ ఎత్తున జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు చేరనున్నారని సమాచారం. ఇప్పటికే పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో వైఎస్సార్‌సీపీ నాయకులు వరుసగా సమావేశమవుతున్నారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే పవన్‌తో సమావేశమయ్యారు. పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇక జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా గ్లాస్‌ పార్టీలో దూకేందుకు సిద్ధమని ప్రకటించారు.


నాయకుల క్యూ
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ చేరికలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి కూడా పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారని టాక్‌. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య , దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు జనసేన పార్టీ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఎవరు వస్తే వారిని చేర్చుకునేందుకు జనసేన సంసిద్ధంగా ఉంది. 


భవిష్యత్‌ పరిణామాలపై..
క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్న జనసేన పార్టీ నాయకుల చేరికతో మరింత బలోపేతం కావాలని ఆరాట పడుతోంది. పార్టీ స్థాపించి పదేళ్లు దాటినా కూడా ఇంకా క్షేత్రస్థాయిలో సక్రమంగా పార్టీ పని చేయడం లేదు. దీనికి తోడు భవిష్యత్‌లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండేందుకు లోలోపల ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితులు ఎల్లవేళలా ఒకేలా ఉండవనే నానుడిని జనసేన అధిష్టానం మదిలో ఉంచుకుని ఆ మేరకు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తాజా చేరికలను చూస్తే అర్థమవుతోంది. ఏది ఏమైనా ఈ చేరికలతో జనసేన బలపడనుండగా.. వైఎస్సార్‌సీపీకి మాత్రం కోలుకోలేని ఎదురుదెబ్బగా చూడవచ్చు. చూడాలి భవిష్యత్‌లో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.