`118` మూవీ రివ్యూ..మీ కోసం
నటీ నటులు : కళ్యాణ్ రామ్ , నివేత థామస్ , శాలినీ పాండే, రాజీవ్ కనకాల , హరి తేజ , ప్రభాస్ శ్రీను తదితరులు
సంగీతం : శేఖర్ చంద్ర
నిర్మాణం : ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్
నిర్మాత : మహేష్ ఎస్ కోనేరు
ఛాయాగ్రహణం : రచన -దర్శకత్వం : గుహన్ కె.వి
విడుదల : 1 మార్చ్ 2019
‘118’ అనే క్రైం థ్రిల్లర్ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చాడు కళ్యాణ్ రామ్. వరుస ఫ్లాపులతో కెరీర్ ను కొనసాగిస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కాడా..? సినిమా ఆడియన్స్ ను థ్రిల్ చేయగలిగిందా..? తెలుగులో ఎన్నో సినిమాలకు ఛాయాగ్రహకుడిగా పనిచేసిన గుహన్ దర్శకుడిగా ఎంత వరకూ సక్సెస్ అయ్యాడు.. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.
కథ :
గౌతమ్(కళ్యాణ్ రామ్) ఓ ఛానెల్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తుంటాడు. ఓ రోజు పారడైజ్ రిసార్ట్స్ లో 118 రూమ్ లో నిద్ర పోతుండగా గౌతంకి ఓ డ్రీం వస్తుంది.. ఆ డ్రీంలో ఒక అమ్మాయిని చంపినట్టు కొన్ని విజువల్స్ స్ట్రైక్ అవుతాయి. అలా ఓ రెండు సార్లు అదే డ్రీం రావడంతో సైకలాజికల్ స్పెషలిస్ట్ (నాజర్)ను కలుస్తాడు గౌతం…. అతని సహాయంతో మిస్టరీ ఛేదించాలని చూస్తాడు. మరోవైపు తను ప్రేమించిన మేఘన ప్రియ (శాలినీ పాండే)తో పెళ్ళికి రెడీ అయిన గౌతం ఆ ఆనందాన్ని పక్కన పెట్టి మరీ స్నేహితుడు(ప్రభాస్ శీను)తో కలిసి డ్రీం గర్ల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అదే సమయంలో ఎస్తర్(హరితేజ) అనే అమ్మాయి ద్వారా తన డ్రీంలో కనిపించిన ఆధ్యా(నివేదా) గురించి తెలుసుకుంటాడు. ఇంతకీ గౌతం డ్రీంలోకి వచ్చిన ఆధ్యా ఎవరు ..? ఆమెను చంపిందెవరు. ఈ చిక్కుముడిని జర్నలిస్ట్ గా గౌతం ఎలా చేదించాడు … చివరికి హంతకులను ఎలా పట్టుకోగలిగాడు అన్నది మిగతా కథ.
నటీ నటుల పనితీరు :
గౌతం క్యారెక్టర్ లో మెప్పించాడు కళ్యాణ్ రామ్. ఎమోషనల్ సీన్స్ లో బాగానే నటించాడు. లుక్ పరంగా కాస్త మార్పు కనిపించినా నటనలో మాత్రం పెద్దగా మార్పు కనపడలేదు. నివేత థామస్ ఆధ్యా క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నివేత నటన సినిమాకు ప్లస్ అయ్యింది. శాలినీ పాండే కేవలం కొన్ని సన్నివేశాలకు , ఒక పాటకు పరిమితం అయ్యింది. రాజీవ్ కనకాల , హరి తేజ తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించారు. కానీ ఎమోషనల్ డైలాగ్స్ చెప్తూ ఆకట్టుకునే రాజీవ్ కి ఈ సినిమాలో ఆ స్కోప్ లభించలేదు. సినిమాలో రాజీవ్ పోషించింది కీలక పాత్రే అయినా పెద్దగా డైలాగులు లేవు. ప్రభాస్ శ్రీను , చమ్మక్ చంద్ర డైలాగ్ కామెడీ పండలేదు. నెగిటీవ్ రోల్ లో గగన్ విహారి బాగా నటించాడు. హర్ష వర్ధన్ ,గీత భాస్కర్ , మీనా , ఆదర్ష్ మిగతా నటీ నటులంతా పరవాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు :
సినిమాకు సంబంధించి ముఖ్యంగా రెండు క్రాఫ్ట్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అందులో ఒకటి సినిమాటోగ్రఫీ , రెండు మ్యూజిక్. ఈ రెండు … సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయి. సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో సినిమాల్లో తన ప్రతిభ చూపించిన గుహన్ మరోసారి కెమెరా వర్క్ తో ఎట్రాక్ట్ చేసాడు. అటు దర్శకుడిగా ఇటు సినిమాటోగ్రాఫర్ గా రెండు బాధ్యతలను భుజాలపై వేసుకొని బాగానే డీల్ చేసాడు. అలాగే శేఖర్ చంద్ర మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ‘చందమామే’ సాంగ్ బాగుంది. కొన్ని సందర్భాల్లో సన్నివేశాలను ఎలివేట్ చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు శేఖర్. ఎడిటింగ్ బాగుంది. ఎక్కువ బోర్ కొట్టకుండా ఎడిట్ చేసారు. సినిమా ఆరంభంలో వచ్చే ఫైట్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే మరో ఫైట్స్ ఫాన్స్ ని ఆకట్టుకుంటాయి. కిరణ్ అందించిన డైలాగ్స్ పేలలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
సమీక్ష:
కెరీర్ లో మొదటిసారి సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో కూడిన క్రైం థ్రిల్లర్ ట్రై చేశాడు కళ్యాణ్ రామ్. 118 అనే ఇంట్రెస్టింగ్ టైటిల్, ట్రైలర్ చూసి కచ్చితంగా ఈసారి మరో కొత్త కథ చూపిస్తాడని ఎదురుచూసిన ప్రేక్షకులను మళ్ళీ రొటీన్ కథతోనే పలకరించాడు కళ్యాణ్ రామ్. కాకపోతే కథ రొటీన్ గా ఉన్నప్పటికీ పరుగులు పెట్టే స్క్రీన్ ప్లే 118ను నిలబెట్టింది. ఇకపై మాత్రం ఈ హీరో స్టోరీస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే.
ఎంచుకున్న కథ రొటీనే అయినప్పటికీ స్పీడ్ నేరేషన్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను నడిపించాడు కేవీ గుహన్. కొన్ని సందర్భాల్లో ఛాయాగ్రహకుడిగా అతనికున్న అనుభవం డైరెక్షన్ కి బాగా కలిసొచ్చింది. నిజానికి డైరెక్టర్ గా కంటే సినిమాటోగ్రాఫర్ గానే ఎక్కువ మార్కులు కొట్టేసాడు గుహన్. ట్రైలర్ లోనే కాన్సెప్ట్ ఏంటో చెప్పేసిన గుహన్.. సినిమా ప్రారంభంలోనే కథ గురించి డీటైల్స్ ఇచ్చేసాడు. ప్రారంభంలో కాస్త కొత్తదనం కనిపించినా చివరికి ఈ కాన్సెప్ట్ తో గతంలో వచ్చిన చాలా సినిమాలు గుర్తొస్తాయి.
ఫస్ట్ హాఫ్ ను కొంత వరకూ ఇంట్రెస్టింగ్ గానే నడిపించినా క్లైమాక్స్ వరకూ ప్రేక్షకుల్లో ఆ ఆసక్తిని కంటిన్యూ చేయడంలో విఫలమయ్యాడు గుహన్. తను చెప్పాలనుకున్న కథను సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నంలో మాత్రం దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు గుహన్. కాకపోతే కథకు కీ ఎలిమెంట్ అనిపించే ఫ్లాష్ బ్యాక్ మాత్రం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఇప్పటికే చాలా మంది దర్శకులు టచ్ చేసేసిన మెడికల్ మాఫియానే మళ్ళీ తీసుకున్నాడు. ఇదే సినిమాకు పెద్ద మైనస్. ఇంకేదైనా కొత్తగా చెప్పే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది.
కళ్యాణ్ రామ్, నివేత థామస్ ల పెర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , కొన్ని సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్ అనిపించగా , రొటీన్ కథ , క్లైమాక్స్ , స్క్రీన్ ప్లే మైనస్ అనిపిస్తాయి. ఓవరాల్ గా ‘118’ సినిమా రొటీన్ కథతో, పరుగులుపెట్టించే స్క్రీన్ ప్లేతో ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది.
రేటింగ్ – 2.75/5