యంగ్ టైగర్ చేతుల మీదుగా విశ్వరూపం 2 ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధం
విశ్వరూపం 2 ట్రైలర్ విడుదలకు ఏర్పాట్లు పూర్తి
2013లో కమల హాసన్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ 'విశ్వరూపం'కు సీక్వెల్‌గా రూపొందిన విశ్వరూపం 2 సినిమా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. మూడు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను ముగ్గురు స్టార్స్ చేతుల మీదుగా ప్రమోట్ చేయించేందుకు కమల్ ప్లాన్ చేయించాడు. అందులో భాగంగానే జూన్ 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు విశ్వరూపం 2 ట్రైలర్ మూడు భాషల్లో ముగ్గురు స్టార్స్ చేతుల మీదుగా ఘనంగా లాంచ్ కానుంది. ఇందులో విశేషం ఏంటంటే, విశ్వరూపం 2 హిందీ వెర్షన్ ట్రైలర్‌ని అమీర్ ఖాన్ రిలీజ్ చేయనుండగా మన తెలుగు వెర్షన్ ట్రైలర్‌ని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ కానుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్... విశ్వరూపం 2 ఒరిజినల్ అయిన తమిళ వెర్షన్‌ని తన కూతురు, స్టార్ హీరోయిన్ అయిన శృతి హాసన్ చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తున్నాడు కమల్ హాసన్. ఫిలిం జర్నలిస్ట్, క్రిటిక్ రమేష్ బాల ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
కమల్ హాసన్ స్వయంగా రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ ఓ ఇంటెలీజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. సీనియర్ ఫిలింమేకర్ శేఖర్ కపూర్, బాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా జెర్మియా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.