ఫిలిం రివ్యూ రైటర్, ఫిలిం జర్నలిస్ట్ మహేష్ కత్తి ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై విమర్శలు గుప్పించారు. ఇటీవల కాలంలో సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైఖరిని తప్పుపట్టి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన మహేష్ కత్తి .. తాజాగా ఏపీకి చేవగల ఎంపీలు కావలెను అని తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేవ గల ఎంపీలు కావలెను అని తన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా పార్లమెంట్‌లో గొంతు విప్పి, రాష్ట్రం కోసం పోరాడగలిగే సత్తా వుండటమే చేవ అని తన వ్యాఖ్యలకి నిర్వచనం కూడా చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, మరోవైపు మహేష్ కత్తి ఫేస్‌బుక్‌లో పెట్టిన ఈ వ్యాఖ్యలపై ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. చేవ లేకుండానే రాష్ట్రం నుంచి ఇంతమంది ఎంపీలు పార్లమెంట్‌కి ఎన్నికవుతూ వస్తున్నారా ? అని మహేష్ కత్తిని నిలదీశారు బుద్ధా వెంకన్న. గొడవలు చేస్తేనే పోరాట యోధులు అవుతారని అనుకోవడం పొరపాటు అని మహేష్ కత్తికి హితవు పలికిన బుద్ధా వెంకన్న.. ఏపీ ఎంపీలని కించపర్చేలా అతడు చేసిన వ్యాఖ్యలని తిరిగి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 


ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతోపాటు ఇంకొంతమంది టీడీపీ నేతలు సైతం మహేష్ కత్తిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారిపార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి పాపులారిటీ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తే, అది చూస్తూ ఊరుకోవడానికి తాము సిద్ధంగా లేమని పలువురు టీడీపీ నేతలు మహేష్ కత్తిపై మండిపడ్డారు.