Mohanraj Died: బాలయ్య విలన్ కన్నుమూత.. ఇండస్ట్రీలో విషాదం..
Mohanraj Died: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 90లలో బాలయ్య, చిరంజీవి, మోహన్ బాబు వంటి హీరోల సినిమాల్లో విలన్ గా నటించిన మోహన్ రాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు.
Mohanraj Died: 90వ దశకంలో తన ఆహార్యంతో తెలుగు సినిమాల్లో విలన్ అలరించిన నటుడు మోహన్ రాజ్. తెరపై ఆయన్ని చూడగానే క్రూరత్వం కనిపిస్తుంది. కేరళ రాష్ట్రానికి చెందిన మోహన్ రాజ్.. ముందుగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తెలుగు, తమిళంలో దాదాపు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా బాలయ్య హీరోగా నటించిన ‘లారీ డ్రైవర్’ సినిమాలో ఈయన చేసిన ‘గుడివాడ రౌడీ’ అలియాస్.. ‘గుడివాడ రాయుడు’ గా ఈయన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఆ తర్వాత బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ సినిమాలో బొబ్బర్లంక రామబ్రహ్మం క్యారెక్టర్ లో తన విలనిజం పండించాడు. ఆ తర్వాత బాలయ్య ఇండస్ట్రీ హిట్ మూవీస్ ‘సమర సింహారెడ్డి’, నరసింహనాయుడు’ సినిమాల్లో కూడా నటించాడు. అటు చిరంజీవి హీరోగా నటించిన ‘మెకానిక్ అల్లుడు’ , వెంకటేష్ హీరోగా నటించిన ‘చిననాయుడు’ తో పాటు మోహన్ బాబు హీరోగా నటించిన ‘అసెంబ్లీ రౌడీ’, బ్రహ్మా సినిమాల్లో విలన్ గా తన నటనతో మెప్పించాడు.
ఈయన 1989లో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘కిరీడామ్’ సినిమాతో మలయాల సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ సినిమాలో జోస్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో ప్రేక్షకులను భయబ్రాంతులకు గురిచేసాడు. ఈ సినిమాతో మోహన్ రాజ్ పేరు ఓవర్ నైట్ పాపులర్ అయింది. కిరిక్కాడాన్ జోస్ గా పేరుతోనే చాలా సినిమాలు చేసాడు. తెలుగులో అదే సినిమాను రాజశేఖర్ హీరోగా ‘రౌడీ యిజం నశించాలి’ పేరుతో రీమేక్ చేసారు. ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బాలయ్య ‘లారీ డ్రైవర్’ సినిమాతో స్టార్ డమ్ అందుకున్నాడు. మొత్తంగా తెలుగులో బాలయ్య సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రల్లో మెప్పించాడు.
సౌత్ సినీ ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోలందరికి విలన్ గా మెప్పించాడు. తెలుగులో చివరగా మోహన్ బాబు హీరోగా నటించిన ‘శివశంకర్’ సినిమాలో కనిపించారు. మలయాళంలో 2022లో ముమ్ముట్టి హీరోగా నటించిన ‘రోర్స్చాచ్’ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత పలు అనారోగ్య సమస్య కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. గురువారం ఆయన చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా తెలియజేసారు. సినిమాల్లో రాకముందు మోహన్ రాజ్ కస్టమ్స్ ఆఫీసర్ గా పనిచేసారు. అంతేకాదు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పనిచేశారు. సినిమాల్లో బిజీ కావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!