తాను నటించిన కొన్ని సినిమాలు, కొంతమంది విద్యార్థులకు ఐఐటీల్లో విజయం సాధించేందుకు ప్రేరణ కలిగించాయని అన్నారు పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. నిన్న జరిగిన ఛల్ మోహన రంగ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌లో మాట్లాడిన పవన్ కల్యాణ్... కొంతమంది విద్యార్థులు తన సినిమాలు చూసి ఐఐటీల్లో విజయం సాధించేంత ప్రేరణ పొందడం ఎంతో సంతోషకరమైన విషయం అని ఆనందం వ్యక్తంచేశారు. నితిన్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి తనపై వున్న అభిమానానికి కృతజ్ఞతలు చెబుతూ.. తాను వరుసగా అపజయాల్లో వున్న సమయంలోనే నితిన్, సుధాకర్ రెడ్డి వచ్చి ఇష్క్ సినిమా ఆడియో లాంచ్ చేయాల్సిందిగా కోరారని, వారి అభిమానానికి కాదు అనలేకే ఆ ఫంక్షన్‌కి వెళ్లానని తెలిపారు. అప్పుడు ఆ సినిమాను సూపర్ హిట్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు పవన్.


కేవలం 16 ఏళ్ల కాలంలోనే 25 సినిమాలు చేసిన నితిన్ కూడా ఎంతో హార్డ్ వర్క్ చేశాడు అని నితిన్‌ని అభినందించిన పవన్ కల్యాణ్.. నితిన్‌కి తనకు వయస్సులో చాలా తేడా వున్నప్పటికీ, సినిమాల అనుభవంలో మాత్రం అతడికి తనకు కేవలం ఐదారు సినిమల తేడానే వుంది అని అన్నాడు. సినిమాల ఫంక్షన్స్‌కి వెళ్లి మాట్లాడటం అంటేనే తనకి ఎంతో ఇబ్బందికరంగా వుంటుంది అని చెప్పిన పవన్ కల్యాణ్.. కేవలం ఐదు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నితిన్ సరసన లై సినిమా ఫేమ్ మెఘా ఆకాష్ జంటగా నటించింది. ఏప్రిల్ 5న ఆడియెన్స్ ముందుకు రానుంది.