నటీనటులు : సుధీర్ బాబు, నబా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవివర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్
సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు
మ్యూజిక్ డైరెక్టర్ : అజనీష్ లోకనాథ్
ఆర్ట్ : శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
నిర్మాత : సుధీర్ బాబు
బ్యానర్ : సుధీర్ బాబు ప్రొడక్షన్స్
స్టోరీ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ : ఆర్ ఎస్. నాయుడు
సెన్సార్ : క్లీన్ U
రన్ టైం : 140 నిమిషాలు
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 21, 2018


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెగ్యులర్‌గా సినిమాలు చేసుకునే ఓ హీరో ఏకంగా నిర్మాతగా మారాడంటే ఆ సినిమాపై అతడికి ఎంత నమ్మకం ఉండాలి. కమర్షియల్‌గా సక్సెస్ అవుతున్న టైమ్‌లో సొంత బ్యానర్ పెట్టి సినిమా తీశాడంటే కంటెంట్‌పై ఎంత ధీమా ఉండాలి. అంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు కాబట్టే తనే హీరోగా, నిర్మాతగా నన్ను దోచుకుందువటే సినిమా తీశాడు సుధీర్ బాబు. మరి ఈ హీరో నమ్మకం నిజమైందా..? ప్రేక్షకుల మనసును ఈ సినిమా దోచుకుందా..? తెలియాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే.


కథ :
కార్తీక్ (సుధీర్ బాబు) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్నత స్థానంలో పనిచేస్తుంటాడు. ఉద్యోగులందరికీ అతడంటే హడల్. టార్గెట్లు పెట్టి హింసిస్తుంటాడు. అతడికి పనే ప్రపంచం. ఫ్యామిలీని కూడా పట్టించుకోని పనిరాక్షసుడు. ఎలాగైనా అమెరికా వెళ్లి డబ్బు సంపాదించి, ఆస్తులు పోగొట్టుకున్న తండ్రిని సుఖపెట్టాలనేది కార్తీక్ టార్గెట్.


ఇలాంటి వ్యక్తిని తన అల్లుడ్ని చేసుకోవాలని చూస్తాడు అతడి మేనమామ (రవివర్మ). కానీ తను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని కార్తీక్‌తో చెబుతుంది అతడి మరదలు. మరదల్ని సేవ్ చేయడం కోసం తను సిరి అనే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రి, మేనమామ దగ్గర అబద్ధం చెబుతాడు కార్తీక్.


ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం చదువుకుంటూ, షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తున్న మేఘన (నబా నటేష్) హెల్ప్ తీసుకుంటాడు. సిరి పేరుతో కార్తీక్ తండ్రికి (నాజర్) దగ్గరైన అల్లరి పిల్ల మేఘన నిజంగానే వాళ్లతో కలిసిపోతుంది. ఒక దశలో కార్తీక్‌ను కూడా ప్రేమిస్తుంది. కానీ కార్తీక్ మాత్రం ఆమె ప్రేమను అర్థం చేసుకోడు. చివరికి మేఘన ప్రేమను కార్తీక్ ఎలా గుర్తిస్తాడు? తండ్రిని ఎలా మెప్పించాడు? తను కోరుకున్న అమెరికా కలను నెరవేర్చుకున్నాడా లేదా అనేది క్లుప్తంగా ఈ సినిమా స్టోరీ.


నటీనటుల పనితీరు :
క్యారెక్టరైజేషన్ కుదిరితే సుధీర్ బాబు పాత్రలో ఎలా ఫిట్ అయిపోతాడో సమ్మోహనం సినిమాలో చూశాం. ఇప్పుడు కూడా సుధీర్ బాబుకు అలాంటి పాత్రే లభించింది. టఫ్ బాస్‌గా కొంచెం నెగెటివ్ షేడ్స్‌లో మెప్పించిన సుధీర్, సేమ్ టైం తండ్రి దగ్గర ఏడ్చే సన్నివేశంలో కూడా అంతే బాగా మెప్పించి ఔరా అనిపించాడు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నబా నటేష్ చూడ్డానికి ఓకే. యాక్టింగ్ కూడా ఓకే.
ఇతర నటీనటుల విషయానికొస్తే సుధీర్ బాబు తండ్రి పాత్రలో నాజర్ మెప్పించాడు. చూడ్డానికి రొటీన్ తండ్రి పాత్రలా అనిపించినప్పటికీ క్లయిమాక్స్‌లో నాజర్ ప్లస్ అయ్యాడు. హీరోయిన్ తల్లిగా నటించిన తులసికి యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. ఆమెతో కామెడీ పండించడానికి చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. వేణు, రవివర్మ, జీవా, వర్షిణి తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.


టెక్నీషియన్స్ పనితీరు :
ఈ సెగ్మెంట్‌లో కూడా మొదట సుధీర్ బాబు గురించే చెప్పుకోవాలి. నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రంతో నిర్మాతగా కూడా మెప్పించాడు సుధీర్. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలా అని ఎక్కడా ఎక్కువ పెట్టలేదు. ఈ కథకు ఎంత పెట్టాలో అంతే బడ్జెట్‌లో క్లీన్ ప్రాడెక్ట్ అందించాడు. కొత్త కుర్రాడు ఆర్ఎస్ నాయుడు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తూనే దర్శకత్వం వహించాడు. హ్యాండిల్ చేసిన ప్రతీ విభాగంలో కొన్ని మైనస్‌లు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా మెప్పించాడు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. ఒక్క పాట మినహా మిగతా పాటలు పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్యం సంగీతం పరవాలేదు. సురేష్ సినిమాటోగ్రఫీ, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నాయి.


‘నన్ను దోచుకుందువటే’ ట్రైలర్ చూసినప్పుడే జనాలకు సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఉద్యోగుల విషయంలో టఫ్‌గా ఉండే ఓ బాస్, అమ్మాయి ప్రేమలో ఎలా పడ్డాడు, ఫైనల్‌గా ఎలా మారాడు అనేది ఈ సినిమా బేసిక్ లైన్. మొన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో కూడా చాలామంది ప్రముఖులు ఈ సినిమా కథను ఇలానే ఉహించారు. సో.. సినిమా స్టోరీ సింపుల్. కాకపోతే దీన్ని ఎంత పకడ్బందీగా ప్రజెంట్ చేశారనే విషయంపైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఈ మేరకు మేకర్స్ బాగానే కష్టపడ్డారు. కథకు కొన్ని యాడ్-ఆన్స్ తగిలించి, సరికొత్త నేపథ్యాలు రాసుకున్నారు.


అంతా బాగుంది కానీ ఈ సింపుల్ కథను రెండున్నర గంటల పాటు చూపించడంలో తడబడ్డారు మేకర్స్. ఎందుకంటే రెండున్నర గంటలు చూపించేంత విషయం కథలో ఏమీ లేదు. అందుకే ఫస్టాఫ్ తేలిపోయింది. కార్తీక్ అనే టఫ్ బాస్‌ను ప్రజెంట్ చేస్తూ సినిమా స్టార్ట్ చేసి, ఎటో తీసుకెళ్లిపోయారు. అలా కాస్త అయోమయంగా మొదలవుతుంది సినిమా. ఎప్పుడైతే హీరో కూడా హీరోయిన్‌ను ఇష్టపడటం మొదలుపెడతాడో.. అప్పట్నుంచి సినిమా ఊపందుకుంటుంది. ఇక అక్కడ్నుంచి క్లైమాక్స్ వరకు సినిమా పరుగులు పెడుతుంది. ఎమోషన్‌ను పర్‌ఫెక్ట్‌గా క్యారీ చేస్తుంది.


నిజానికి ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత బలంగా ఉందో హీరోయిన్ పాత్ర అంతకంటే బలంగా ఉంది. క్యారెక్టరైజేషన్లు అలాంటిది. సో.. టాలీవుడ్ ఆడియన్స్‌కు తెలిసిన హీరోయిన్‌ను, ఇలాంటి హీరోయిన్ పాత్రకు  పెట్టుకుంటే ఈ సినిమా మన మనసుల్ని మరింత దోచుకునేది. అలా అని నబా నటేష్ సరిగ్గా నటించలేదని చెప్పలేం. తెలుగులో మొదటి సినిమాకే ఆమెకిది చాలా బరువైపోయింది. దీనికి తోడు హీరోయిన్‌ను హైపర్ యాక్టివ్‌గా చూపించారు. అంత హైపర్‌నెస్ నబాలో కనిపించలేదు.


విలక్షణమైన కథలు, పాత్రలు ఎంచుకునే సుధీర్ బాబు.. నిర్మాతగా మారి రిస్క్ చేసినా తన పంథా మాత్రం వీడలేదు. ఈ విషయంలో సుధీర్ బాబును మెచ్చుకోవాలి. ఓవైపు నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు నటుడిగా బాగా చేశాడు. షార్ట్ ఫిలిం షూటింగ్‌లో డైలాగ్స్ సరిగ్గా చెప్పలేని సన్నివేశంలో కామెడీ కూడా పండించాడు. ఈ సీన్‌ను ట్రైలర్‌లో చూపించకుండా ఉన్నట్టయితే థియేటర్లలో ఇంకా బాగా పేలేది.


దర్శకుడి విషయానికొస్తే తొలి సినిమానే అయినప్పటికీ ఆర్ఎస్ నాయుడు మంచి సన్నివేశాలు రాసుకున్నాడు. ఇలాంటి కొన్ని ప్లస్ పాయింట్స్ మధ్య ఈ సినిమాను కాస్త వెనక్కి లాగే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అది సంగీతం మాత్రమే. మైండ్‌లో రిజిస్టర్ అయ్యే పాటలు ఇందులో లేవు. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్ లేదు. కామెడీ కోసం ట్రై చేసిన సీన్లు పండలేదు. దీనికి తోడు హీరో, నాజర్‌ను మినహాయిస్తే చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఆర్టిస్టులు లేరు. వీటిని మినహాయిస్తే, ఓ క్లీన్ ఎంటర్‌టైనర్ కోరుకునే వాళ్లకు ‘నన్ను దోచుకుందువటే’ సినిమా నచ్చుతుంది.


రేటింగ్ – 2.75 /5


జీ సినిమాలు సౌజన్యంతో....