పోలీసుల ఎదుట బాగా నటించాను.. ఛాన్స్ ఇవ్వండి : వర్మ
హైదరాబాద్‌లో సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరైన వర్మ... విచారణ ముగిశాకా చేసిన పలు ట్వీట్స్ ఇప్పుడు మరో వివాదానికి తెరతీశాయి.
గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా విడుదల చేసిన పలు పోస్టర్లు, టీజర్లు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. వర్మ విడుదల చేసిన పోస్టర్లు, అతడు తెరకెక్కించిన చిత్రం మహిళల్ని కించపర్చేలా వున్నాయంటూ సామాజిక కార్యకర్త దేవి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేయడం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఈ వివాదం క్రమంలోనే వర్మ తనని అసభ్య పదజాలంతో దూషించాడు అంటూ దేవి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లోనే వర్మపై సీసీఎస్ పోలీసులు ఓ కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి శనివారంనాడు హైదరాబాద్‌లో సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరైన వర్మ... విచారణ ముగిశాకా చేసిన పలు ట్వీట్స్ ఇప్పుడు మరో వివాదానికి తెరతీశాయి. పోలీసుల ఎదుట బాగా నటించానని, తనకు నటుడిగా దర్శకుడు ఎవరైనా అవకాశం ఇవ్వండి అని వర్మ చేసిన ట్వీట్స్ అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.
వర్మ ట్వీట్స్‌లో మర్మాన్ని చూస్తే, అతడు పోలీసులకు చెప్పిన వివరాలన్నీ అబద్ధాలేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలావుంటే, ఈ వర్మ చేసిన ట్వీట్స్‌పై స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్... " మీ కోసం స్క్రిప్ట్ సిద్ధంగా వుందని, డేట్స్ ఇవ్వడమే ఆలస్యం " అని ట్వీట్ చేశాడు. ఇవన్నీ ఇప్పుడు వర్మను మరోసారి వార్తల్లో నిలిచేలా చేశాయి.