Virataparvam Review: రానా, సాయిపల్లవిల `విరాటపర్వం` రివ్యూ అండ్ రేటింగ్
Rana - Sai pallavi`s Virataparvam Review : రానా, సాయి పల్లవి జంటగా నీది నాది ఒకే కథ లాంటి సినిమాను తెరకెక్కించిన వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన సినిమా విరాటపర్వం. ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
Rana Sai - pallavi's Virataparvam Review : రానా, సాయి పల్లవి జంటగా ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్, నివేదా పేతురేజ్, ఈశ్వరీ రావు, జరీనా వాహబ్ వంటి స్టార్ క్యాస్టింగ్ తో రూపొందిన సినిమా విరాటపర్వం. నీది నాది ఒకే కథ లాంటి సినిమాను తెరకెక్కించిన వేణు ఉడుగుల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టు సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమా మీద అంచనాలు పెంచేలా చేశాయి. ఈ క్రమంలో సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుండా? అనేది రివ్యూలో చూద్దాం.
విరాటపర్వం కథ ఏమిటంటే?
కధ అంతా 90లలో జరుగుతూ ఉంటుంది. వెన్నెల(సాయిపల్లవి) పుట్టుకే నక్సలిజంతో ముడిపడి ఉంటుంది. పోలీసులు-నక్సల్స్ మధ్య కాల్పుల సమయంలో జన్మిస్తుంది. అలా పుట్టిన ఆమె చిన్ననాటి నుంచే పట్టుదల కలిగిన అమ్మాయిగా పెరుగుతుంది. అయితే యుక్తవయసు వచ్చేనాటికి వెన్నెల `అరణ్య` పేరుతో నక్సలైట్ రవన్న(రానా) రాస్తున్న పుస్తకాలకు ఆకర్షితురాలై, ఆయన రాతలకు ముగ్దురాలవుతుంది. ఎవరో, ఎలా ఉంటాడో తెలియకపోయినా ఆమె అతనితో ప్రేమలో పడుతుంది. ఎలాగైనా ఆయన్ని కలవాలని, తన ప్రేమని ఆయనకు చెప్పాలని అనుకుంటున్న క్రమంలోనే మొదటిసారి రవన్నని చూస్తుంది. ఆ తర్వాత ఆయన రాసిన పుస్తకాలు చదివి మరింతగా ఆయనకు ఆకర్షితురాలవుతుంది. తండ్రి(సాయిచంద్) ఒగ్గుకథలో విన్న ఒక్కమాటతో మేనబావ(రాహుల్ రామకృష్ణ)తో పెళ్లి కాదనుకుని వెళ్లిపోతున్నట్టు లెటర్ రాసి వెళ్లిపోతుంది వెన్నెల. అయితే అలా వెళ్ళిన వెన్నెల రవన్నను కలిసిందా? కలిస్తే తన ప్రేమని ఆయనకు చెప్పిందా? వెన్నెల ప్రేమని రవన్న ఒప్పుకున్నాడా? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన సినిమా కథ.
విశ్లేషణ :
ఇది కల్పిత కధ కాదు. 90వ దశకంలో తెలుగు నక్సలిజం చరిత్రలో కొన్ని మాయని మరకలుగా మిగిలిన అంశాలలో ఒక దాన్ని కధా వస్తువుగా తీసుకున్నాడు దర్శకుడు. ముందు నుంచి ఈ విషయం మీద గోప్యత పాటించినా చివరికి ఏమనుకున్నారో ఏమో కానీ సరళ అనే ఒక యువతి జీవితం ఆధారంగానే సినిమా తెరకెక్కించామని చెప్పడమే కాక సాయి పల్లవిని సరళ ఇంటికి తీసుకువెళ్ళింది సినిమా యూనిట్. ప్రేమ కోసం వెళ్ళిన సరళను కోవర్ట్ గా అనుమానించి నక్సలైట్లే చంపిన విషయాన్ని కాస్త కన్విన్సింగ్ గా చెప్పడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అయితే ఈ సినిమా మొత్తం కూడా వెన్నెల పాత్ర రవన్న పాత్ర మీద ప్రేమను దక్కించుకోవడం అనే కోణంలోనే ఉంటుంది కానీ అసలు ఆమెకి ప్రేమ కలగడానికి బలమైన కారణం ఎస్టాబ్లిష్ కాలేదేమో అనిపిస్తుంది. నక్సలిజంతో ముడిపడి ఉన్న వెన్నెల అసలు రవన్నను ఎందుకు ఇష్టపడుతుందో కన్విన్సింగ్ గా చెప్పి ఉంటే బాగుండేది. సినిమా మొత్తం రవన్నని వెన్నెల కలిసేందుకు చేసే ప్రయాణమే. కానీ దాన్ని సాదాసీదాగా నడిపించేసినట్టు అనిపిస్తుంది. ఇంకా బలంగా ఎమోషన్స్ పండించే అవకాశం ఉన్నా ఎందుకో ఆ విషయం మీద ఫోకస్ చేయలేదు. సున్నితమైన అంశాన్ని కన్విన్సింగ్ గా తెరకెక్కించిన దర్శకుడు ఎక్కువ డీటైలింగ్ కు వెళ్లి అసలు విషయం పక్కన పెట్టడనిపిస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
సినిమా మొత్తాన్ని కూడా సాయి పల్లవి తన భుజ స్కందాల మీద మోసింది. ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తూ, యాక్షన్ సీన్స్‌లో కళ్ళార్పకుండా చూసేలా చేసింది. తెలంగాణ పల్లెటూరి పిల్లగా సాయి పల్లవి జీవించింది, సదరు పాత్రలో ఒదిగిపోయింది. దళ నాయకుడు రవన్న పాత్రలో రానా ఒదిగిపోయాడు. నిజానికి చాలా మంది నటీనటులు మనకు కనిపించినా స్క్రీన్ ప్లే ప్రభావంతో ఎక్కువ సాయి పల్లవి, రానా పాత్రలకే మనం కనెక్ట్ అవుతాం. ఇక దళ సభ్యులు భారతక్కగా ప్రియమణి, రఘన్నగా నవీన్ చంద్ర, శకుంతలగా నందితా దాస్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. వెన్నెల తల్లిదండ్రులుగా సాయిచంద్, ఈశ్వరీరావు ఆకట్టుకున్నారు. జరీనా వాహబ్, రాహుల్ రామకృష్ణ, నివేదిత పేతురాజ్, బెనర్జీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. భారీ క్యాస్టింగ్ ఉన్నా వారి పాత్రల పరిధి చాలా తక్కువే.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే
దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమాను అందరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించేందుకు ప్రయత్నించి కొంత మేర సఫలం అయ్యాడు. అక్కడక్కడా సీన్లు కాస్త రిపీట్ అయినట్టు అనిపిస్తాయి కానీ ఎమోషన్స్ విషయంలో కొంత మేర వెనుకపడ్డారు. ఆయనే రచయిత కావడంతో కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి. అవి చాలా మందికి కనెక్ట్ అవుతాయి. సినిమా మొత్తంగా టెక్నికల్ గా ఎక్కడా వంక పెట్టడానికి వీలు లేకుండా సరిగ్గా కుదిరింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అందించిన పాటలు, జానపద గేయాలు మరీ ముఖ్యంగా నేపథ్య సంగీతం అన్నీ మనసును తాకేలా కుదిరాయి. ఇక కెమెరామెన్ల పనితనం ఔరా అనిపిస్తుంది. దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్ సహజమైన లొకేషన్లను అంతే సహజంగా చిత్రీకరించి మనముందుకు తీసుకురావడంలో సఫలమయ్యారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రీకర్ ప్రసాద్ కూడా తన మార్క్ చూపాడు.
ఫైనల్గా
ప్రేమ కధలు ఇష్టపడే వారికి సినిమా కనెక్ట్ అవుతుంది. సాయి పల్లవి, రానాల నట విశ్వరూపం చూడాలనుకుంటే సినిమా మిస్ కాకండి.
నటీనటులు : సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితా దాస్, జరీనా వాహబ్, ఈశ్వరీ రావు, నవీన్ చంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ : శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు
దర్శకత్వం : వేణు ఊడుగుల
సంగీతం : సురేశ్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
రేటింగ్: 3/5
Also Read: Virata Parvam Real Story: విరాటపర్వం అసలు కథ ఇదేనా... సాయి పల్లవి పాత్ర నిజ జీవితంలో ఆమెదేనా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.