మస్త్ మస్త్ బ్యూటీ ఆఫ్ బాలీవుడ్
"తూ ఛీజ్ బడీ హై మస్త్ మస్త్".. పాటను ఎప్పుడైనా విన్నారా..బాలీవుడ్ ఇండస్ట్రీనే ఒక్క వూపు ఊపిన పాట ఇది. అందులో తన డ్యాన్స్‌తో మాస్ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టి.. హీరోతో సమానంగా నటించిన..స్టన్నింగ్ బ్యూటీ ఆమె. తొలి సినిమాకే ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొంది.. హిందీ చిత్రసీమలో చాలా కాలం పాటు తనదైన శైలిలో నటిస్తూ.. ఒకానొక సందర్భంలో టాప్ హీరోయిన్ల లిస్టులో కూడా చేరింది ఆమె. ఒక మాస్ హీరోయిన్ స్థాయి నుండి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం పొందిన నటిగా గౌరవం పొందిన ఆమె పేరే రవీనా టాండన్. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ బాలీవుడ్ బ్యూటీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం
26 అక్టోబరు 1974 తేదీన రవి టాండన్, వీణ దంపతులకు ముంబయిలో జన్మించారు రవీనా టాండన్. జుహూ ప్రాంతంలో మితిబాయ్ కాలేజీలో కొంతకాలం బి.ఏ చదివిన ఆమె చలనచిత్రాల్లో అవకాశాల కోసం తన చదువుకు స్వస్తిపలికారు. యాడ్ డిజైనర్ ప్రహ్లాద్ కక్కర్ వద్ద డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే పార్ట్ టైమ్ అప్రంటీస్‌గా చేసేవారట రవీనా. అక్కడ ఉన్నప్పుడే తొలిసారిగా ఆమెకు కూడా బాలీవుడ్‌లో నటిగా కెరీర్ ప్రారంభించాలనే కోరిక కలిగింది. అప్పటికే ఆమె నటుడు సంజయ్ దత్‌కి పెద్ద ఫ్యాన్.
రవీనా నటించిన తొలి సినిమా "పత్తర్ కే పూల్". 1991లో సల్మాన్ ఖాన్ సరసన రవీనా నటించిన ఈ సినిమా ఆమెకు తొలిసారిగా నూతన నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందించింది. ఆ తర్వాత రవీనా నటించిన మోహ్రా (1994) చిత్రం ఆమెకు స్టార్ స్టేటస్‌ను కట్టబెట్టింది. అందులో ఆమె అక్షయ్ కుమార్‌తో కలిసి "తూ ఛీజ్ బడీ హై మస్త్ మస్త్" పాటకు చేసిన డ్యాన్స్ పెద్ద హిట్. అందులో హీరోతో సమానంగా డ్యాన్స్ చేసిన రవీనా, పెద్ద పెద్ద బాలీవుడ్ నిర్మాతల దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత వరుసగా ఆమెకు ఆఫర్లు వచ్చాయి
1994లో అజయ్ దేవగన్‌తో రవీనా నటించిన "దిల్ వాలే" ఇండస్ట్రీ హిట్. తొలుత దివ్యభారతిను హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసినా, ఆమె హఠాత్తుగా మరణించడంతో, అదే పాత్ర రవీనాని వరించింది. "దిల్ వాలే" సినిమా రవీనా జీవితంలో ఒక మైలురాయి. ఆ తర్వాత వచ్చిన లడ్లా, ఇమ్తిహాన్, అందాజ్ అప్నా అప్నా, ఖిలాడియోంకా ఖిలాడీ, జిద్దీ రవీనా కెరీర్‌లో అతి పెద్ద హిట్స్
కుచ్ కుచ్ హోతా హై, దిల్ తో పాగల్ హై, గుప్త్ లాంటి చిత్రాల్లో కూడా తొలుత రవీనాయే హీరోయిన్‌గా నటించాల్సి ఉందట. కానీ బిజీ హీరోయిన్‌గా ఉండి డేట్స్ కుదరకపోవడంతో ఆమె ఆ సినిమాలకు సైన్ చేయలేదు. అయితే అవే సినిమాలు ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి.
2002లో వచ్చిన "దామన్" చిత్రం రవీనా కెరీర్‌లోనే అతి గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. గృహహింస నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం రవీనాకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం కట్టబెట్టింది. ఎందరో విమర్శకులు ఈ సినిమాలో రవీనా నటనకు కితాబిచ్చారు. ఈ సినిమా తర్వాత రవీనా నటించిన అక్స్, సత్తా, షూల్, సంధ్య సినిమాల్లో పాత్రలు కూడా ప్రశంసలు పొందాయి.
రవీనా టాండన్ పలు తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో కూడా నటించారు. 1993లో నందమూరి బాలక్రిష్ణ సరసన "బంగారుబుల్లోడు" చిత్రంలో నటించిన రవీనా, అదే సంవత్సరం "రథసారధి" చిత్రంలో కూడా నటించారు. 1994లో "సాధు" అనే తమిళ చిత్రంలో కూడా నటించారు. 1999లో "ఉపేంద్ర" చిత్రంతో కన్నడంలో కూడా పరిచయమయ్యారు.
2003లో తొలిసారిగా "సాహిబ్ బీబీ గులామ్" చిత్రం ద్వారా బుల్లితెరకు నటిగా పరిచయమైన రవీనా ఆ తర్వాత పలు రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు.
2004లో అనిల్ తడానీ అనే సినీ నిర్మాతను వివాహం చేసుకున్నారు రవీనా. ఈ దంపతులు పూజ, ఛాయ అనే ఇద్దరు అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు.
2003 నుండి చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఛైర్మన్‌గా వ్యవహరించారు రవీనా. అయితే ఆమె ఎక్కువగా సొసైటీ కార్యక్రమాలలో పాలుపంచుకోనందుకు విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. దాంతో 2005లో ఆమె ఆ పదవి నుండి రిజైన్ చేశారు.
2010 సంవత్సరం నుండి అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు రవీనా. 2014లో "పాండవులు పాండవులు తుమ్మెద" అనే తెలుగు సినిమాలో నటించారు రవీనా. 2017లో మాత్రు, షాబ్ అనే రెండు చిత్రాలకు సైన్ చేశారామె.